మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్

విశాఖపట్నంలో 'విజన్ విశాఖ' ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 7:28 AM GMT
cm jagan, comments, vision visakha, andhra pradesh government,

మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్

విశాఖపట్నంలో 'విజన్ విశాఖ' ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సు నిర్వహించారు. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్‌ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామనీ.. దాని ప్రభావం ఇప్పటికీ మన రాష్ట్రంపై కొనసాగుతుందని సీఎం జగన్ అన్నారు. అయితే.. ప్రస్తుతం విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ను మించి అభివృద్ధిలో దూసుకెళ్తుందని సీఎం జగన్ అన్నారు.

ఏపీలో అన్ని రంగాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. చాలా రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఇలాంటి వాటన్నింటికీ పోర్టులు, ఇతర రవాణా సౌకర్యాలు తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం, పోర్టులు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయని సీఎం జగన్ వివరించారు.

వచ్చే ఎన్నికల గురించి కూడా సీఎం జగన్ కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖపట్నం రాష్ట్ర అభివృద్ధికి బ్యాక్‌ బోన్‌గా ఉండబోతుందని సీఎం జగన్ చెప్పారు.

Next Story