'టెస్టులు' పిల్లల‌కు వేసే డైప‌ర్ల లాంటివి.. అవి మాసిన‌ప్పుడే మార్చాలి

By Newsmeter.Network  Published on  13 Jan 2020 11:05 AM GMT
టెస్టులు పిల్లల‌కు వేసే డైప‌ర్ల లాంటివి.. అవి మాసిన‌ప్పుడే మార్చాలి

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తెరపైకి తీసుకొచ్చిన నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు తోసిపుచ్చగా తాజాగా ఆ జాబితాలోకి భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్ ను మార్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఐసీసీని ప్ర‌శ్నించాడు.

‘డైపర్లు, ఐదు రోజుల టెస్టు క్రికెట్‌.. వాటి పని పూర్తయినప్పుడే మార్చాలి. నేను ఎప్పుడూ మార్పులను స్వాగతిస్తూనే ఉన్నా. పింక్‌ టెస్టుల తరహా మార్పు వంటిది ఆహ్వానించదగింది. కానీ టెస్టు ఫార్మాట్‌నే మార్చడం సరైనది కాదు. టెస్టు క్రికెట్‌ అనేది ఒక రొమాన్స్‌. ఒకవేళ ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను మార్చాలనుకుంటే అది పూర్తిగా మాసిపోయిన తర్వాత చేయాలి. అది పిల్లలకు వేసే డైపర్‌లాంటింది. టెస్టు క్రికెట్‌ అనేది 143 ఏళ్ల ఫిట్‌నెస్‌ కల్గిన వ్యక్తిలాంటిది. అదొక ఆత్మ’ అని సెహ్వాగ్ చెప్పాడు.

సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, మెక్‌గ్రాత్‌, రికీ పాంటింగ్‌, గౌతం గంభీర్‌ నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ను వ్య‌తిరేకించ‌గా ఇర్ఫాన్ ప‌ఠాన్ మాత్ర‌మే నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ను స‌మ‌ర్థించాడు. ‘నాలుగు రోజుల టెస్టు గురించి నేను ఈ రోజు చెబుతున‍్న మాట కాదు.. చాలా ఏళ్లుగా నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌ గురించి చెబుతూనే ఉన్నాను. దాన్ని చూస్తాననే నమ్మకం నాకు ఉంది. రంజీల్లో నాలుగు రోజుల మ్యాచ్‌లే ఆడి ఫలితాల్ని చూస్తున్నప్పుడు, టెస్టు మ్యాచ్‌ల్లో ఆ విధానాన్ని ఎందుకు పెట్టకూడదు.

ఇటీవల కాలంలో మనం మూడు-నాలుగు రోజుల్లోనే టెస్టులు ముగిసిపోతున్నాయి. నాలుగు రోజులు టెస్టు ఫార్మాట్‌ తీసుకొచ్చినా ఎటువంటి ఇబ్బంది రాదు. దీనికి నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా’ అని ఇర్ఫాన్‌ అన్నాడు.

Next Story
Share it