నిత్యం అంద‌రి నోళ్ల‌ల్లో నానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. శుక్ర‌వారం ఉప్పల్ స్టేడియం వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మ‌రోమారు వార్తల్లో నిలిచాడు. వివ‌రాళ్లోకెళితే.. నిన్న విండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బౌల‌ర్ కెస‌రిక్ విలియమ్స్ బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్ బాదాడు. అనంత‌రం విలియమ్స్ ఉద్దేశించి కోహ్లీ తన 'చేతిని తెరిచిన నోట్‌బుక్ లా మార్చి.. రైట్‌ టిక్‌' కొడుతున్నట్లు చేసిన సంబ‌రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే.. గతంలో ఓ మ్యాచ్‌లో కోహ్లీ వికెట్‌ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్‌కు.. కోహ్లీ అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. సిక్స‌ర్ కొట్టిన వెంట‌నే కోహ్లీ.. అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ విష‌య‌మై మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. గతంలో విండీస్‌ పర్యటనలో తనను ఔట్‌ చేసినపుడు విలియమ్స్‌ చేసిన సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చాన‌ని తెలిపాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. మూడు టీ20ల‌ సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ 50 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీతో పాటు రాహుల్ కూడా రాణించ‌డంతో తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story