సమం చేస్తారా..? అప్పగించేస్తారా...?

By Newsmeter.Network  Published on  7 Feb 2020 6:54 PM IST
సమం చేస్తారా..? అప్పగించేస్తారా...?

కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు తొలి వన్డేల్లో భారీ షాకిచ్చింది న్యూజిలాండ్‌. టిమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం ఉదయం 7.30 గంటల నుంచి ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ ను కైవసం చేసుకోవాలని కివీస్‌ ఆరాటపడుతుండగా.. ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

రెండు మార్పులతో టీమిండియా..

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. హామిల్టన్ మ్యాచ్‌తో భారత్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఓపెనర్లు ఫృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌ తొలి వన్డేలో విఫలమయ్యారు. తొలి వికెట్‌ కు 50 పరుగులు జోడించినా.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కాగా రెండో వన్డేలో వీరు రాణిస్తారని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక పరుగుల యంత్రం, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌ లో అర్థశతకాన్ని అందుకోలేకపోయిన తొలి వన్డేల్లో ఆ ఘనతను అందుకున్నాడు. కానీ.. లెగ్ స్పిన్నర్‌ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకునే కోహ్లీ బలహీనత మళ్లీ తెరపైకి వచ్చింది. కోహ్లి లాంటి ఆటగాడికి ఆ బలహీనతను అధిగమించడం పెద్ద కష్టం కాదు. ఇక భారత్ జట్టు నెం.4 నిరీక్షణకి తెరదించిన శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు టీమ్‌లో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్నాడు. తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్ శతకంతో రాణించగా.. రాహుల్ సైతం అర్థశతంతో పుల్ ఫామ్‌ లో ఉన్నాడు. కోహ్లీతో పాటు రాహుల్, అయ్యర్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని జట్టు మెనేజ్‌మెంట్ కోరుకొంటోంది.

ఆల్‌ రౌండర్‌ కోటాలో తొలి వన్డేలో స్థానం దక్కించుకున్న కేదార్‌ జాదవ్‌ బ్యాటింగ్‌ లో ఫర్వాలేదనిపించాడు. అయితే.. కోహ్లీ మ్యాచ్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా అతనితో వేయించలేదు. దీంతో ఐదుగురు బౌలర్లే బౌలింగ్ చేయగా అదనపు బౌలర్‌ ఉండింటే..? బాగుండేదనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రెండో వన్డేకి జాదవ్‌పై వేటు వేసి ఆల్‌రౌండర్ శివమ్ దూబేని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజాకి బ్యాటింగ్‌లో మాత్రం ఎక్కువగా అవకాశాలు లభించడం లేదు. తొలి వన్డేలో బ్యాటింగ్‌కి రాని జడేజాని రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు పంపాలని భావిస్తోంది. భారీ స్కోర్లు నమోదైన తొలి వన్డేల్లో ఒక్క బుమ్రా తప్ప అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ 9 ఓవర్లు వేసి 8.89 ఎకానమీతో 80 పరుగులిచ్చాడు. టీమ్‌లోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచిన ఠాకూర్‌ ను రెండో వన్డేకి తప్పించి అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి రెండో వన్డేలో ఛాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉత్సాహాంలో కివీస్‌..

టీ20 సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. తొలి వన్డేలో గెలవడం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో సందేహాం లేదు. తొలి వన్డేలో విజయం సాధించిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌ ఈ మ్యాచ్‌ కు కూడా అందుబాటులో ఉండని నేపధ్యంలో మరోసారి కివీస్‌ బ్యాటింగ్‌ భారం మొత్తం ఆ జట్టు సీనియర్‌ బ్యాట్స్ మెన్‌ రాస్ టేలర్‌ పైనే పడనుంది. తొలి వన్డేలో శతకంతో జట్టుకు విజయాన్ని అందించిన రాస్‌టేలర్‌ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ నే ఆశిస్తోంది కివీస్ మేనేజ్‌మెంట్. విలియమ్‌ సన్‌ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టామ్‌లేథమ్ తో పాటు ఓపెనర్‌ గుప్టిల్, ఆల్ రౌండర్‌ నీషమ్‌ లు తమ స్థాయికి తగ్గట్లు రాణిస్తే న్యూజిలాండ్‌ కు తిరుగుఉండదు.

ఇరు జట్లను ఉరిస్తున్న ఓ రికార్డు..

ఇరు జట్లను ఓ రికార్డు మాత్రం ఊరిస్తోంది. తొలి వన్డేలో ఓటమి పాలైనా గత రెండు రెండు సిరీస్‌లను గెలుచుకున్న ఘనత టీమిండియాదైతే, ఇప్పటివరకూ ఇరు దేశాల వన్డే చరిత్రలో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి వన్డేలో పరాజయం చూసిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు. దాంతో అదే సెంటిమెంట్‌ను రిపీట్‌ చేయాలని న్యూజిలాండ్‌ కసితో ఉంది. గతంలో న్యూజిలాండ్‌లో భారత్‌ రెండు వన్డే సిరీస్‌లను మాత్రమే గెలిచింది. 2008-09లో 3-1 తేడాతో కివీస్‌పై గెలిచిన టీమిండియా.. 2019లో 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈ రెండు సందర్భాల్లో భారత్‌ తొలి వన్డేలో గెలిచిన తర్వాతే న్యూజిలాండ్‌ను వారి గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకుంది.

Next Story