సహనం కోల్పోయిన విరాట్.. అంఫైర్‌తో వాదన

By Newsmeter.Network  Published on  8 Feb 2020 5:31 AM GMT
సహనం కోల్పోయిన విరాట్.. అంఫైర్‌తో వాదన

ఆక్లాండ్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్‌ తో కాసేపు వాదనకు దిగాడు. అసలు ఏం జరిగిందంటే.. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ 17 ఓవర్‌ లో స్పినర్‌ చాహల్ వేసిన బంతి కివీస్‌ ఓపెనర్‌ హెన్రీ నికోలస్ బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. దీంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ వేలెత్తేశాడు.

అంపైర్ ఔట్ నిర్ణయంపై నికోలస్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపి డీఆర్‌ఎస్ ను కోరాడు. అప్పటికే డీఆర్‌ఎస్ కౌంట్ డౌన్ టైమ్ జీరోకి వచ్చేసింది. అంపైర్ ఆ ఛాలెంజ్‌ని అంగీకరిస్తూ థర్డ్ అంపైర్‌కి నివేదించడంపై కెప్టెన్ కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయం వెలువడిన తర్వాత 15 సెకన్లలోపు మాత్రమే ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం క్రికెటర్‌కి ఉంటుంది. దీంతో కోహ్లి అంఫైర్ తో వాదనకు దిగాడు. కోహ్లికి తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన అంపైర్లు.. ఆ తర్వాత తమ నిర్ణయంలో తప్పు ఉంటే..? థర్డ్ అంపైర్ తమకి చెప్తాడంటూ గట్టిగా బదులిచ్చారు. దీంతో కోహ్లీ వెనక్కి తగ్గాడు. అంపైర్లు, కోహ్లీ మధ్య వాదన జరుగుతుండగానే రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతికి బ్యాట్‌కి తాకకుండా నేరుగా వికెట్లని తాకేలా కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ నిర్ణయానికే ఓటేశాడు. నికోలస్(41: 59 బంతుల్లో 5x4) నిరాశగా పెవిలియన్‌ వైపు నడిచాడు.

Next Story