విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారిని బాక్స్‌లో పడుకోబెట్టి..

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు.

By Srikanth Gundamalla  Published on  4 Sep 2024 7:12 AM GMT
విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారిని బాక్స్‌లో పడుకోబెట్టి..

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. చెరువులు, నదులు.. వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం తగ్గినా కూడా వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వరదలు పోటెత్తాయి. బెజవాడ నగరం మొత్తం వరదలతో వణికిపోయింది. ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి. పెద్ద భవనాలు తప్ప చిన్న ఇళ్లు పూర్తిగా మునిగాయి. దాంతో.. స్థానికులంతా భవనాల మీదకు వెళ్లి వరద నుంచి తప్పించుకున్నారు.

విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఇలా అందరూ దిగారు. సహాయక చర్యలు అందిస్తున్నారు. ఫుడ్‌ ప్యాకెట్స్‌ను పడవలు, హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. వీటికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. విజయవాడ వరదల్లో కనిపిస్తున్న దృశ్యాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు.. వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్నికావు. డ్రమ్ములు, లారీ ట్యూబ్‌లు.. ప్లాస్టిక్ బాక్స్‌లు ఇలా ఏది దొరికితే అది ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలే చేస్తున్నారు. చిన్నారులు, గర్భిణు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు.

విజయవాడలో ఒక దృశ్యం అందరినీ కలచివేసింది. బాహుబలి సీన్‌ను మరోసారి రిపీట్ చేసినట్లు అనిపించింది. సింగ్‌నగర్ మొత్తం వరదతో మునిగిపోయిన విషయం తెలిసిందే. వరద నుంచి బయట పడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఒక చిన్నారిని తొట్టె (బాక్సు)లో పడకోబెట్టి.. దాన్ని మునిగిపోకుండా ఉండే ప్లాస్టిక్ షీట్‌పై ఉంచారు. అలా చిన్నారి వరదలో మునిగిపోకుండా ముందుకు సాగుతూ తీసుకెళ్లారు. భనవాల్లో ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు విజయవాడ వాసుల ఇబ్బందులను చూసి అయ్యో పాపం అంటున్నారు.



Next Story