'లియో' సినిమా ఆడుతున్న థియేటర్లో అభిమాని ఎంగేజ్‌మెంట్

విజయ్‌ సినిమా లియో ఆడుతున్న థియేటర్లో ఆయన అభిమాని ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 10:49 AM IST
vijay fan, engagement,  leo, movie theatre ,

'లియో' సినిమా ఆడుతున్న థియేటర్లో అభిమాని ఎంగేజ్‌మెంట్

హీరో విజయ్‌ నటించిన తాజా సినిమా 'లియో' గురువారం దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. దాంతో.. బిగ్‌ స్క్రీన్‌పై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. త్రిష కథానాయికగా కనిపించారు. ప్రియా ఆనంద్‌, మడోనా సెబాస్టియన్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, గౌతమ్‌మీనన్‌, మిష్కిన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. హిట్‌ టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్‌ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కేక్‌లు చేయడం.. స్వీట్లు పంచడం.. బాణాసంచా కాల్చడం వంటివి చేస్తున్నారు. అయితే. లియో సినిమా నడుస్తోన్న థియేటర్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

పుదుకోటైకి చెందిన వెంకటేష్‌ అనే విజయ్‌ అభిమాని తను ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్‌లో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అతను మాట్లాడుతూ... తనకు తల్లి, తండ్రి ఎవరూ లేరని విజయ్‌నే తనకు అంతా అని పేర్కొన్నాడు. అందుకే తాను వివాహ నిశ్చితార్థం విజయ్‌ సినిమా విడుదల సందర్భంగా.. థియేటర్లో జరుపుకున్నట్లు చెప్పారు.

అదేవిధంగా క్రిష్ణగిరికి చెందిన మరో వీరాభిమాని లియో చిత్రం చూడడానికి థియేటర్‌కు వచ్చి ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలని గోడపై నుంచి క్యూలోకి దూకడంతో కాలుకు తీవ్ర గాయమైంది. గాయంతోనే అతను థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు.

పుదుకోట్టైలో లియో సినిమా చూడటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులు ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరగడంపై మౌనం పాటించారు. ఈ యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకున్నారు. అందుకుగాను విజయ్‌ అభిమానులు కొంచెంసేపు మౌనం పాటించారు. పలుచోట్ల టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. పలుచోట్ల అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఏదేమైనా విజయ్‌ సినిమా పెద్ద హిట్‌గా నిలవడంతో ఆయన అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story