వందేభారత్‌లో కిక్కిరిసిపోయిన జనం.. వైరల్ వీడియో

వందేభారత్ ట్రైన్లు ఖాళీగా తిరుగుతున్నాయనే ప్రచారం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  11 Jun 2024 9:11 AM GMT
vande bharat, heavy rush, train, Indian railways,

వందేభారత్‌లో కిక్కిరిసిపోయిన జనం.. వైరల్ వీడియో 

కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలం ముందు ఇండియన్‌ రైల్వేస్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు వందేభారత్. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలను కల్పించారు. హైస్పీడ్‌తో త్వరగా గమ్యస్థానానికి చేరుకునేలా ఈ రైళ్లను నడుపుతున్నారు. ఈ ట్రైన్లలో చార్జీలు దాదాపుగా విమానం రేంజ్‌లో ఉన్నాయని.. దాంతో ప్రయాణికులు దూరం ఉంటున్నారని మొదటగా వార్తలు వచ్చాయి. వందేభారత్ ట్రైన్లు ఖాళీగా తిరుగుతున్నాయనే ప్రచారం జరిగింది. హైస్పీడ్‌ రైళ్లలో జనాలే లేరు అంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. కానీ.. తాజాగా వందేభారత్‌ రైల్‌లో సాధారణ ట్రైన్‌లో కంటే జనాలు ఎక్కువగా కనిపించారు. సీట్లు అన్నీ నిండిపోవడమే కాదు.. కనీసం నిలబడేందుకు స్థలం కూడా దొరకలేదు. ఈ సంఘటన లక్నో జంక్షన్‌ నుంచి డెహ్రాడూన్‌ మధ్య నడుస్తోన్న వందేభారత్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది నిజమేనా అంటూ వందేభారత్‌లో రద్దీ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇండియన్ రైల్వేస్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్‌ కొంటే ఇంత ఇబ్బందికర ప్రయాణాన్ని అందిస్తారా అంటూ నిలదీస్తున్నారు. మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ వీడియోపై మరో వాదన కూడా వినిపిస్తోంది. వాళ్లంతా జనరల్‌ టికెట్‌ కొని అందులో ప్రయాణం చేశారని అంటున్నారు. ఇక ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.

Next Story