Telangana: బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 7:01 AM GMT
tsrtc, women fight,  chappals,  bus,

Telangana: బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే.. మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో.. కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్సు సర్వీసులు తక్కువగా ఉన్న రూట్లలో అయితే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటున్నాయి. దూర ప్రయాణం సైతం నిలబడే వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఏకంగా మహిళలు చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సాధారణంగానే మహిళలు నీటి కుళాయిల వద్దో.. లేక నిత్యవసరాల సరుకుల ధరల్లో తేడాలో వస్తే గొడవలు పెట్టుకోవడం చూశాం. కానీ.. ఫ్రీ బస్సు జర్నీ తెచ్చిన తంటాతో సీటు కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. ముందు మాటామాటా అనుకున్నారు. ఎవరూ తగ్గకుండా రెచ్చిపోయి తిట్టుకున్నారు. దాంతో.. గొడవ పెద్దదిగా మారింది. కాళ్ల చెప్పులు తీసుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో చెప్పులు తీసి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

ఇక వాళ్లలా గొడవపడుతుంటే బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. ఆ పోస్టు కాస్త వైరల్‌ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. కేవలం సీటు కోసం ఇంత గొడవ అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చూశారా సార్‌ ఫ్రీ జర్నీ సదుపాయం ఎక్కడి వరకు తీసుకెళ్లిందో అంటూ మరింకొందరు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు.


Next Story