ఆహారంలో ఎలుక ప్రతక్ష్యం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

విమాన ప్రయాణం అంటేనే ఖర్చుతో కూడుకున్నది.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 8:30 PM IST
ఆహారంలో ఎలుక ప్రతక్ష్యం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

విమాన ప్రయాణం అంటేనే ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుకు తగ్గట్లుగానే ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యాలు అన్ని వసతులు కల్పిస్తాయి. ఎకానమీ క్లాస్‌ నుంచి బిజినెస్‌ క్లాస్ వరకు వివిధ రకాల సేవలను అందిస్తుంటారు. అయితే.. అప్పుడప్పుడు విమానాల్లో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా గాల్లో ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడికి విమాన సిబ్బంది ఆహారం అందించారు. అయితే.. అందులో బతికున్న ఎలుక ప్రత్యక్ష్యం అయ్యింది. అంతే.. విమానాన్ని అత్యవసరంలా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ఇటీవల నార్వే లోని ఓస్లో నుంచి స్పెయిన్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికి ప్రయాణికులకు ఆహారం అందించారు విమాన సిబ్బంది. అందులో ఒక ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బతికి ఉన్న ఎలుక కనిపించింది. దాంతో.. అతను ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. అంతేకాదు.. ఎలుక బయటకు జంప్‌ చేసి విమానంలో తిరగసాగింది. ఎలుక తిరుగుతుందన్న విషయం తెలుసుకున్న ప్రయాణికులు గందరగోళం చేశారు. ఈ విషయంపై పైలట్‌కు సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తం అయ్యిన పైలట్‌ విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డెన్మార్క్‌కు మళ్లించారు. కోపెన్‌హాగన్‌లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విమానంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీఇనపై స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటమని తెలిపింది.

Next Story