భారత్‌ మాతాకీ జై అంటూ జెండా ఎగరేసిన పాకిస్థాన్ మహిళ సీమా

ప్రస్తుతం సీమా హైదర్ భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం వైరల్‌గా మారింది.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 1:34 PM IST
Pakistan Woman, Seema,  har ghar tiranga,

భారత్‌ మాతాకీ జై అంటూ జెండా ఎగరేసిన పాకిస్థాన్ మహిళ సీమా

పబ్‌జీ గేమ్‌లో పరిచయం అయిన ఇండియన్‌ను పెళ్లి చేసుకునేందుకు సీమా హైదర్‌ అనే పాకిస్థాన్‌కు చెందిన మహిళ కొంతకాలం ముందు ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఏదో ఒక విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అంటూ మూడు రంగుల జెండాకు సెల్యూట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పంద్రాగస్టు వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి అందరి దృష్టిలో పడింది.

ప్రియుడు సచిన్‌ను పెళ్లాడి తాను భారతీయురాలిగా మారిపోయానని సీమా హైదర్ అంటున్నారు. భరతమాత తనకు కూడా తల్లే అని.. తాను ఇక మీదట పాకిస్థాన్‌కు వెళ్లబోనని స్పష్టం చేశారు. అయితే.. తనకు భారత పౌరసత్వం కావాలని కోరుతోంది సీమా. అందుకు గాను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సీమా హైదర్ భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం వైరల్‌గా మారింది. ఆమె జాతీయ పతాకం పోలిన చీరను ధరించి.. చేతిలో జెండాతో నిలబడింది. భరతమాతకు జేజేలు పలికింది. హర్‌ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సీమా హైదర్. నోయిడాలోని తన ప్రియుడి ఇంట్లో పిల్లలు, లాయర్‌తో కలిసి ఈ వేడుకలు జరుపుకొన్నారు సీమా హైదర్. ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. సీమా హైదర్ ప్రేమ దేశ సరిహద్దులు దాటి సంచలనంగా మారింది. దీంతో..ఆమె లవ్‌ స్టోరీని సినిమాగా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'కరాచీ టు నోయిడా' పేరుతో సినిమాను నిర్మించనున్నట్లు నోయిడాకు చెందిన ఓ నిర్మాత ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా సీమా హైదర్‌ను నటించాలని అడిగారట. దానికి ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సీమాతో సినిమాలు తీసే ప్రయత్నాలు ఎవరూ చేయొద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన హెచ్చరికలు జారీ చేసింది. మరి సీమా లవ్‌ స్టోరీ తెరమీదకు వస్తుందా..? వస్తే అందులో ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story