తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు

ముంబైలోని ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 9:08 AM GMT
Mumbai airport, two flights, one runway,

తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు

ముంబైలోని ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. సాధారణంగా రన్‌వేల గురించి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌.. పైలట్లకు సమాచారం అందిస్తుంటారు. ఇక విమానం టేకాఫ్‌ తీసుకునేంత వరకు కూడా పైలట్లతో వారే అందుబాటులో ఉంటారు. రూట్‌ క్లియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలి. కానీ.. ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంటోంది. అప్పుడే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్‌కు వచ్చింది. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఏకకాలంలో కదులుతూ కనిపించాయి. ఎయిరిండియా ఫ్లైట్ వెనకాలే.. ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యింది. ఒకానొక క్షణంలో ముందు వెళ్తున్న విమానాన్ని.. వెనుకాల ల్యాండైన ఫ్లైట్ ఢీకొంటుందేమో అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అదృష్టం బాగుండి ఏ ప్రమాదమూ జరగలేదని అంటున్నారు.

ఈ తప్పిదంపై డీజీసీఏ స్పందించి.. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అధికారిని డీజీసీఏ తొలగించింది. ఇక రెండు విమానాల్లో ప్రయాణికులు వందకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి విమానంలో ఉన్నసమయంలో ఈ విషయం తెలియదు. కానీ.. ల్యాండ్‌ అయ్యాక తప్పిన ప్రమాదం గురించి తెలుసుకుని కంగారుపడ్డారు. ఎలాగోలా బయటపడ్డాం చాలంటూ ఊపిరిపీల్చుకున్నారు. విమానాల ఎయిర్‌ట్రాఫిక్ విషయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Next Story