వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడ్డ జనం

మచిలీపట్నంలో వర్షాల కారణంగా పొటెత్తిన వరదలో పాల ప్యాకెట్లు కొట్టుకువచ్చాయి.

By Srikanth Gundamalla
Published on : 14 July 2023 1:11 PM IST

Milk Packets, Rain, Flood, Machilipatnam,

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడ్డ జనం

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మచిలీపట్నంలో అయితే రోడ్లు వాగులను తలపించాయి. ఈ క్రమంలో మచిలీపట్నంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం పడ్డాక వరద వచ్చింది. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయింది. అప్పుడే అనుకోకుండా పాల ప్యాకెట్లు నీటిలో కొట్టుకురాడం ప్రారంభమయ్యింది. ఏంటీ పాలప్యాకెట్లు వరదలో వస్తున్నాయని స్థానికులు ముందు షాక్‌ అయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని పాల ప్యాకెట్లను సొంతం చేసుకోవడానికి నీళ్లలోకి దిగారు. అందినకాడికి పాల ప్యాకెట్లను తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే.. వరదలో పాల ప్యాకెట్లు కొట్టుకురావడంపై తర్వాత ఆరా తీశారు అధికారులు. ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరికి చెందినవి అనే కోణంలో దర్యాప్తు చేశారు. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాల్లోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు నీటిలో పడిపోయాయి. నీటిలో వాహనం నడపడం ద్వారా రోడ్డుపై ఉన్న గుంతలు డ్రైవర్‌కు తెలియలేదు. దీంతో ఒక్కసారిగా కుదుపులకు గురైన పాల వాహనం నుంచి ట్రేలు నీటిలో పడిపోయాయి. డ్రైవర్ వాటిని గమనించే లోపే.. వరద వేగంగా ఉండటంతో పాల ప్యాకెట్లు అన్నీ కొట్టుకుపోయాయి. అలా నీటిలో కొట్టుకువచ్చిన పాలప్యాకెట్లనే మచిలీపట్నంలోని కొందరు స్థానికులు ఏరుకుని వెళ్లిపోయారు. కాగా.. గత రెండ్రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో ఉపరితలం కారణంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు ఇలానే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వర్షాల నుంచి అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story