లోకోపైలట్ల సాహసం.. బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్‌కు రిపేర్లు (వీడియో)

నిత్యం రైళ్లలో లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 4:00 AM GMT
locopilots, Adventure, Repair, train,

లోకోపైలట్ల సాహసం.. బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్‌కు రిపేర్లు (వీడియో)

నిత్యం రైళ్లలో లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. అయితే.. అప్పుడప్పుడు సాంకేతిక లోపాల కారణంగా రైళ్లు మార్గమధ్యలోనే ఆగిపోతుంటాయి. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కూడా ఇలానే ఒక ప్యాసింజర్‌ రైలు ఆగిపోయింది. అయితే.. ఆ రైలు ఒక బ్రిడ్జిపై నిలిచిపోయింది. దాంతో.. సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇద్దరు లోకో పైలట్లు సాహసం చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదని.. వారిని సమయానికి గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతో డేంజర్ స్టంట్ చేశారు. బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్‌కు రిపేర్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నర్కటీయా గోరఖ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైలు శుక్రవారం బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజిన్‌లో అన్‌లోడర్‌ వాల్వ్‌తో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిపోవడంతో రైలు నిలిచిపోయిందని లోకోపైలట్లు గుర్తించారు. దాంతో.. మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని తెలుసుకుని వారే రిపేర్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రధాన లోకోపైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు తామే స్వయంగా సమస్యను పరిష్కరించే సాహసం చేశారు.

లోకోపైలట్లలో ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయసాగాడు. మరో లోకోపైలట్‌ సాహసోపేతంగా బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి రిపేర్ చేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్యాసింజర్లు ఈ వీడియోను రికార్డు చేశారు. ఈవీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Next Story