యుద్ధ వీరుడికి ఘనస్వాగతం పలికిన ఇండిగో సంస్థ.. వీడియో వైరల్

యుద్ధ వీరుడికి ఇండిగో విమానయాన సంస్థ ఘన స్వాగతం పలికింది. చిరు సత్కారం చేశారు విమానం సిబ్బంది.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 1:19 PM IST
IndiGo Flight, pilot honour, Major Sanjay Kumar, Viral,

 యుద్ధ వీరుడికి ఘనస్వాగతం పలికిన ఇండిగో సంస్థ.. వీడియో వైరల్

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తారు జవాన్లు. అన్నీ వదులకుని దేశ ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. అలాంటి వారికి భారతీయులంతా ఎప్పుడూ రుణపడే ఉంటారు. ఈ క్రమంలోనే ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడిన యుద్ధ వీరుడికి ఇండిగో విమానయాన సంస్థ ఘన స్వాగతం పలికింది. అంతేకాదు విమానంలో తమ తరఫున చిరు సత్కారం చేశారు విమానం సిబ్బంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

పరమ్‌ వీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్‌ కుమార్‌ ఆదివారం పూణె వెళ్లారు. ఇండిగో విమానంలో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ మేజర్ సంజయ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికింది. విమానం టేకాఫ్‌కు ముందు మేజర్‌ను గౌరవిస్తూ కెప్టెన్‌ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఫ్లైట్‌తో ఇవాళ మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారంటూ ప్రారంభించారు. ఆయన ఎవరో కాదు పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ అంటూ చెప్పారు. ఆ తర్వాత ఆయన పోరాడిన తీరు గురించి కూడా చెప్పారు.

‘1999 జూలై 4న జమ్ముకశ్మీర్‌ రైఫిల్స్‌ 13వ బెటాలియన్ సభ్యుడిగా ఉన్న సంజయ్‌ కుమార్‌ కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడారు. శత్రువుల దాడిలో ఆయన చెస్ట్‌లో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అంతేకాక ముంజేతిపైనా బుల్లెట్‌ తగిలి గాయం అయ్యింది. అయినా సంజయ్ కుమార్ వెనకడుగు వేయలేదు. శరీరం నుంచి రక్తం ఏరులై కారిపోతున్నా ముందుకు కదిలలారు. శత్రువల బంకర్‌లోకి వెళ్లి పాకిస్తాన్‌ సైనికులను చీల్చి చెండాడారు.’ అని కెప్టెన్‌ మైక్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు. దాంతో..విమానంలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. మేజర్ సంజయ్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యుతన్న అవార్డు అందుకున్నందుకు అందరూ సంజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆ తర్వాత ఫ్లైట్‌ సిబ్బంది కూడా చిరు కానుకను అందజేసి మేజర్ సంజయ్‌ కుమార్‌ను సత్కరించారు

దీనికి సంబంధించిన దృశ్యాలన్నింటినీ వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోనే ఇండిగో సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది. హీరోతో కలిసి విమాన ప్రయాణం అంటూ వీడియోకు ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దేశానికి విశేష సేవలందించిన మేజర్‌ సంజయ్‌ కుమార్‌కు నెటిజన్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

Next Story