వివాదంలో ఇండిగో విమాన సంస్థ, శాండ్‌విచ్‌లో బతికున్న పురుగు..

ఇండిగో విమానయాన సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 6:43 PM IST
Indigo Airlines, live worm, sandwich ,

వివాదంలో ఇండిగో విమాన సంస్థ, శాండ్‌విచ్‌లో బతికున్న పురుగు..

ఇండిగో విమానయాన సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. విమాన ప్రయాణ ఖరీదు చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. విమానంలో ప్రత్యేకంగా ఫుడ్‌ను కూడా అందిస్తుంటారు. చాలా నీట్‌గానే సర్వ్‌ చేస్తుంటారు. వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి.. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు ఉంటాయి. అయితే.. ఓ మహిళకు విమానంలో అందించిన ఆహారంలో నాణ్యతతో పాటు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం చేసింది. ఆమె ఆర్డర్ చేసిన శాండ్‌విచ్‌లో ఏకంగా బతికి ఉన్న పురుగు వచ్చిందని వాపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన ఖుష్బూ గుప్తా డిసెంబర్ 29న ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరింది. ఈ జర్నీలో ఆమె ముందుగానే వెజ్‌ శాండ్‌విచ్‌ను ఆర్డర్‌ చేసుకుంది. ఈ క్రమంలో ప్రయాణ సమయంలో విమాన సిబ్బంది ఆమెకు శాండ్‌విచ్‌ను తెచ్చిఇచ్చారు. ఆమె ఆ శాండ్‌విచ్‌ను చూసి షాక్‌ అయ్యింది. అందులో ఒక బతికి ఉన్నపురుగు కనిపించింది. ఇదే విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపింది. అయితే.. వారు ఆమె ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆమె వాదనను వదిలేసి ఇతరులకు ఫుడ్‌ను అలాగే సర్వ్‌ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వీడియో తీసి వివరిస్తూ వాపోయింది. శాండ్‌విచ్‌ గురించి చెబుతున్నా ఇండిగో సిబ్బంది పట్టించుకోకుండా.. అవే శాండ్‌విచ్‌లను పిల్లలు, వృద్ధులకు ఇస్తున్నారని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు బాగా తీసుకుంటారు.. మరెందుకు ఇలాంటి ఆహారాన్ని ఇస్తున్నారని నిలదీశారు. పైగా సదురు మహిళ ఫిర్యాదు చేస్తున్నా విమాన సిబ్బంది పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చివరకు ఈ సంఘటన ఇండిగో విమాన సంస్థ దృష్టికి వెళ్లింది. ఒక ప్రకటనలో సుదరు మహిళకు సంస్థ క్షమాపణలు చెప్పింది. దీనిపై విచారణ జరుపుతున్నామనీ.. ఆహారం విషయంలో కచ్చితంగా శ్రద్ధ పెడతామని చెప్పుకొచ్చింది. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది ఇండిగో సంస్థ.


Next Story