రన్‌వేపైనే భోజనం.. ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్టుకు నోటీసులు

ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 10:54 AM GMT
flight, passengers, eating food,  mumbai airport, runway ,

రన్‌వేపైనే భోజనం.. ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్టుకు నోటీసులు

ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది. ఇండిగో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వేపైనే వేచి చూడాల్సి వచ్చింది. అంతేకాదు.. ముంబై ఎయిర్‌పోర్టులోని రన్‌వేపైనే కింద కూర్చొని భోజనం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పలువురు వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో.. నెట్టింట అది వైరల్ అయ్యింది. చివరకు ఈ సంఘటనపై స్పందించిన కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో విమానయాన సంస్థతతో పాటు, ముంబై ఎయిర్‌పోర్టుకు నోటీసులు జారీ చేసింది.

పొగమంచు కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఆలస్యమైంది. ప్రయాణికులు అప్పటికే రన్‌వేపైకి వచ్చి వేచి చూస్తున్నారు. విమానం మాత్రం టేకాఫ్‌ తీసుకోలేదు. పొగమంచు కారణంగా విమానం టేకాఫ్‌ తీసుకోకపోవడంతో.. చాలా సమయం వరకు రన్‌వేపైనే వేచి చూశారు ప్రయాణికులు. తర్వాత అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నా.. ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది.

ఇక విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయానశాఖ మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేవం నిర్వహించి.. విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలు విడుదల చేశారు. కానీ.. ఆ తర్వాత కూడా ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయణికులు రన్‌వేపై కూర్చొని భోజనం సంచలనంగా మారింది.

Next Story