“ఆడ వాసన”తో ఈ చిరుతను చేగువేరా చేసేస్తారా?

By రాణి  Published on  6 Feb 2020 7:34 AM GMT
“ఆడ వాసన”తో ఈ చిరుతను చేగువేరా చేసేస్తారా?

ఇది శతాబ్దాలుగా జరుగుతున్నదే....విప్లవవీరుడు చేగువేరా ఎంతకీ పట్టుబడకపోతే బొలీవియా ప్రభుత్వం ఆయన మీదకి అల్టిమేట్ అస్త్రాన్ని సంధించింది. ఆ ఆస్త్రం ఓ అందమైన అమ్మాయి. అంతే చెట్టంత మన చేగువేరా విప్లవాన్ని చాపచుట్టి అమ్మాయి వలలో పడిపోయాడు. ఆ తరువాత భద్రతా దళాల వలలో పడిపోయాడు. అంతెందుకు? చరిత్రలో చాణక్యుడు శత్రువులను పట్టి పరిమార్చడానికి విషకన్యలను ప్రయోగించలేదా? అసలు భస్మాసురుడనే భయంకర రాక్షసుడిని తన తలపై తానే చెయ్యిపెట్టుకునేలా చేసింది ఎవరు? హొయలొలికి, కులికే అన్నుల మిన్న కాదా? ఋషులు, మునుల తపస్సును భంగం చేసేందుకు ఇంద్రుడు రంభ ఊర్వశి, మేనకల్ని ప్రయోగించలేదా?

ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఇదే ఫార్ములా ఉపయోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో స్వైర విహారం చేసి, 48 జంతువులను భోంచేసి, గ్రామీణులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న చిరుతను పట్టేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైపోవడంతో ఇప్పుడు ఆడ చిరుతను పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహిస్తున్నారట. గత ఏడాదిగా దీన్ని పట్టుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవట. ఏడు సార్లు జంతువులను ఎరగా వేశారట. నాలుగైదు సార్లు పారదర్శక బోన్లను పెట్టారట. ఇంకా ఇంకా ఉచ్చులు పన్ని ఎదురు చూశారట. ఏవీ ఫలించలేదు. దాంతో చివరికి “ఆపరేషన్ ఆపోజిట్ సెక్స్” పైనే ఆశలు పెట్టుకున్నారు. నెహ్రూ జువాలజికల్ పార్కు లోని ఒక ఆడచిరుత మూత్రాన్ని సేకరించి, దానిని బోన్ల వద్ద చిలకరించారట. చిరుతలు, పులులు తమ భాగస్వాములను మూత్రం వాసన ఆధారంగానే పసిగడతాయట. పైగా అవి సంభోగానికి సిద్ధంగా ఉన్నాయన్నదీ మగ పులులకు తెలిసిపోతుందట. అలాగైనా దానిని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారట.

గత ఏడాది జనవరి నుంచి ఈ చిరుత రంగారెడ్డి జిల్లా కడ్తల్, యాచారం, కందుకూరు అడవుల్లో యథేచ్ఛగా సంచరిస్తోంది. గత శనివారం ఈ చిరుత ఆరడుగుల ఫెన్సింగ్ ను లంఘించి దాటి, ఒక ఇంట్లోని ఆరు మేకలను ఒకే దెబ్బకు చంపేసింది. ఈ సంఘటన ఆమనగల్లు మండలంలోని మంగళపల్లిలో జరిగింది. ఇప్పుడిక మరో మార్గం లేక ఆడ చిరుత మూత్రంతో మగ చిరుతను పట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారట. చేగువేరా అంతటి వాడు చిక్కినప్పుడు చిరుత ఎంత అంటున్నారట అధికారులు.

Next Story