చంద్రబాబు అరెస్ట్ పరిణామాలపై కేంద్రానికి NSG నివేదిక
చంద్రబాబు అరెస్ట్ సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌జీ) నివేదిక అందించింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 12:08 PM ISTచంద్రబాబు అరెస్ట్ పరిణామాలపై కేంద్రానికి NSG నివేదిక
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబుని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు తరలించడం సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌జీ) నివేదిక అందించింది. చంద్రబాబుకు ఎస్‌జీటీ భద్రత కల్పిస్తున్న విషయం విధితమే.
సెప్టెంబర్ 8 తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం, జైల్లో చంద్రబాబు భద్రత వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించింది. జైల్‌లో చంద్రబాబుకి కల్పిస్తున్న భద్రతపై సహా తదితర అంశాలపై నివేదికలో ఎన్‌ఎస్‌జీ పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉందయం 6 గంటలకు సీఐడీ అరెస్ట్‌తో పాటు ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రతలో ఉన్న చంద్రబాబుని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. ఇక 10వ తేదీన విచారణ సందర్భంగా భద్రతా పరంగా అంత పటిష్ఠంగా లేని కోర్టు హాలు వెలుపల ఆయనను ఉంచినట్లు పేర్కొంది. సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయన భద్రత ఏమిటన్న విషయంతో పాటు జైలు అవరణలోకి వెళ్ళే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్టు తమ నివేదికలో ఎన్‌ఎస్‌జీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. మొత్తం నివేదికను చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎన్‌ఎస్‌సీ సిబ్బంది కేంద్ర హోంశాఖకు, ఎన్ఎస్‌జీ ప్రధాన కార్యాలయానికి నివేదిక సమర్పించారు.