బెజవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
విజయవాడలో విలక్షణ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:06 PM ISTబెజవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
విజయవాడలో విలక్షణ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ పర్యటించారు. భారతీయుడు-2 షూటింగ్ కోసం బెజవాడ వచ్చారు కమల్ హాసన్. ఈ సందర్భంగా విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.. ఇక, సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్.. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సినీరంగంలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని కమల్ హాసన్ అన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని దేవినేని అవినాష్ కొనియాడారు. అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటు.. కృష్ణ పేరు నిలబెడుతున్నారని పేర్కొన్నారు. షూటింగ్‌లలో కమల్ ఎప్పుడూ బిజీగా ఉంటారనీ.. ఆయన సమయం చూసుకుని కృష్ణ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. నగర ప్రజల తరపున, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇక పది రోజుల్లోనే కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా దేవినేని అవినాష్ చెప్పారు.