బాబును చూస్తుంటే జాలేస్తోంది : ఎంపీ విజయసాయి
By రాణి Published on 20 Feb 2020 2:30 PM IST
ఈ మధ్య రాజకీయ నేతలు కూడా ఎదురెదురుగా విమర్శించుకోవడం లేదు. సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక రాజకీయ నాయకులెక్కడా గొడవలు పడట్లేదు. ఎక్కువగా ట్విట్టర్ ద్వారా ఒకరినొకరు టాగ్ చేస్తూ..తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయింది. ఇలా నిత్యం ట్వీట్లు చేసి ప్రత్యర్థులను తిట్టే వారిలో విజయసాయిరెడ్డి ముందుంటారనడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఎవరిని తిట్టాలన్నా..ట్విట్టర్ లోనే తిట్టేస్తారు.
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. '' గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు.'' అని కామెంట్ చేశారు.
''అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడు. కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటా. ఎమ్మెల్యేలను చుట్టూ పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. చేసిన తప్పులు సామాన్యమైనవా తప్పించుకోవడానికి!'' అని విమర్శించారు.