టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గుర్తున్నాడా..? అదేనండి గతేడాది అంబటి రాయుడి ప్లేస్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యాడుగా ఆ ఆటగాడు. అతని ఎంపిక పై అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మూడు కోణాల్లో ఉపయోగపడతాడని పేర్కొనగా.. ఇప్పుడే 3డి కళ్లద్దాలకు ఆర్డర్‌ ఇచ్చా అంటూ అంబటిరాయుడు ట్వీట్ చేయడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ప్రపంచకప్‌లో అంచనాలు అందుకోలేక విఫలమైన ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.. నెట్స్‌లో గాయపడి స్వదేశానికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టులో చోటు దక్కలేదు ఈ ఆటగాడికి.  ప్రస్తుతం విజయ్‌ శంకర్‌ దేశవాళీల్లో తమిళనాడు, భారత్‌-ఏ తరఫున క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు భారత్‌-ఏ తరఫున షాడో టూర్‌ కోసం న్యూజిలాండ్‌ వెళ్లాడు. వన్డేలు, అనధికార టెస్టులు ఆడాడు.
ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్‌ చేయని సాహాసం చేశాడు. 134మీటర్ల ఎత్తునుంచి బంగీ జంప్‌ చేశాడు. క్వీన్స్‌టౌన్‌లోని దక్షిణ ఆల్ప్స్‌ పర్వాతాల మధ్య ఈ వేదిక ఉంది. రెండు కొండల మధ్య నెవిస్‌ నది ప్రవహిస్తుండగా.. అటు.. ఇటు రోప్‌వే మాదిరిగా ఒక వేదిక కదులుతుంది. అది పర్వతాల మధ్యలోకి వచ్చాక అక్కడి నుంచి దూకేస్తారు.

నెవిస్‌ బంగీ జంప్‌ ఎత్తు 134 మీటర్లు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాటిలో మూడోది. దూకే వ్యక్తి గంటకు 128 కి.మీ వేగంతో కిందకు పడతాడు. ఇలాంటి జంప్‌ చేయడం ఆషామాషీ ఏం కాదు. ఎంతో ధైర్యం అవసరం. ‘వావ్‌.. నా ఒంట్లో అడ్రినలిన్‌ పొంగిపొర్లింది. న్యూజిలాండ్‌లో అత్యంత ఎత్తైన బంగీజంప్‌ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. కుదిరితే అందరూ ఇది చేయాలని కోరుతున్నా’ అని విజయ్‌ ట్వీటాడు. బంగీ జంప్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.