విజయ్ సేతుపతి సరసన సమంత, నయనతార

By Newsmeter.Network  Published on  18 Feb 2020 1:51 PM IST
విజయ్ సేతుపతి సరసన సమంత, నయనతార

సమంత అక్కినేని.. పెళ్లాయ్యాక కూడా దక్షిణాదిన పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే 'జాను' ద్వారా పలకరించిన సమంత తన తర్వాతి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. అందుకు కారణం ఏమిటంటే ఆ సినిమాలో ఉన్న స్టార్ కాస్టింగ్. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించబోతున్న తదుపరి సినిమాలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సమంతను సంప్రదించింది చిత్ర బృందం.. అందుకు సమంత కూడా ఓకె చెప్పేయడం విశేషం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది సమంత.

ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా రూపొందుతోందని.. కామెడీ సీన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని.. స్క్రిప్ట్ చదివాక సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని చెప్పింది సమంత. తన క్యారెక్టర్ కూడా ఎంతో ఫన్, హ్యూమర్ తో కూడుకున్నదని చెప్పుకొచ్చింది.

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార గతంలో 'నానుం రౌడీదాన్(నేనూ రౌడీనే)' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయ్యింది. ఈ కాంబినేషన్ లోకి సమంతా కూడా చేరడం సినిమాకు ఎంతో ప్లస్ కానుందని చిత్ర బృందం తెలిపింది. దాదాపు రెండేళ్ల క్రితమే సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేశామని.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఇదే మంచి సమయం అని అంటున్నాడు దర్శకుడు విగ్నేష్ శివన్. విజయ్ సేతుపతి, నయనతార, సమంతలకు స్క్రిప్ట్ బాగా నచ్చిందని.. విజయ్ సేతుపతి తన క్యారెక్టర్ కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారని విగ్నేష్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దక్షిణాదిన పలు ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోబోతోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

Next Story