నిజమెంత: కరోనా భయంతో గుడ్లను పారవేస్తే.. ఇలా పిల్లలు బయటకు వచ్చాయా..?
By సుభాష్
ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నా వాళ్ళను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లోనూ, వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్ లలోనూ పెద్ద ఎత్తున ఫేక్ మెసేజీలు రావడం మొదలయ్యాయి. తలా తోక ఉండదు.. అది నిజమేనేమో అని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలో ఎన్నో నెట్టింట దర్శనమిస్తున్నాయి. వాటిలో ఓ వీడియో 'వందలాది కోడి పిల్లలు.. అప్పుడే గుడ్డు లో నుండి బయటకు వచ్చాయి. కరోనా భయంతో గుడ్లను అక్కడ పారేయగా.. కోడి పిల్లలు వచ్చాయి' అన్నది ఆ వీడియో సారాంశం.
ఆ వీడియోను పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. “Eggs which were thrown as waste because of corona , after one week hatched. The creation of nature. (Fwded) Life has its own mysterious ways." అని ఆమె ట్వీట్ చేశారు. "కోడిగుడ్డు వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయంతో మనం వాటిని పారేస్తున్నాం. అయితే, అవి ఓ వారం తరువాత ఇలా కోడిపిల్లలుగా మారతాయి. ఇదే సృష్టి స్వభావం. ప్రతి జీవితానికీ దాని సొంత మార్గం ఉంటుంది"
ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫేస్ బుక్ లో కూడా చాలా మంది వైరల్ చేశారు.
నిజమెంత:
న్యూస్ మీటర్ ఆ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని.. గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అలాంటి వీడియోలు చాలానే దొరికాయి. అది కూడా పాకిస్థాన్ కు చెందిన యుట్యూబ్ ఛానల్స్ లో కనిపించాయి. ఈ వైరల్ వీడియోను 'లైఫ్ విత్ సుఫురా' అనే యుట్యూబ్ ఛానల్ లో మర్చి 29, 2020న అప్లోడ్ చేశారు. క్యూటెస్ట్ బేబీ చిక్స్// సుజానీ టౌన్ కరాచీ// వైరల్ వీడియో అని ఆ మీద ఉంది. సుజానీ టౌన్ లో రోడ్డు పక్కన కోడి గుడ్లను పడవేశారని.. కొద్దిరోజుల తర్వాత వేడి కారణంగా ఆ కోడి గుడ్లలో నుండి పిల్లలు బయటకు వచ్చాయని ఆ వీడియోలో తెలిపారు.
ఆ వీడియోను పాకిస్థాన్ కు చెందిన కొన్ని మీడియా ఛానల్స్ కూడా షేర్ చేశాయి.
ఈ వీడియోను ఈ మధ్యనే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. కోవిద్-19 వైరస్ భయంతో అలా కోడి గుడ్లను పారేశారు అనడంలో ఎటువంటి నిజం లేదు. అంతేకాకుండా కరోనా భయంతో అలా పారేశారన్నది ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి షేర్ చేస్తున్న సమాచారం పచ్చి అబద్ధం.
ఓ ఫేక్ వీడియోను గుడ్డిగా నమ్మి, దాన్ని ఫార్వర్డ్ చేసిన వారిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా చేరిపోయారు. దీంతో ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శించారు నెటిజన్లు. ఆ తర్వాత ఆమె తాను చేసిన తప్పును తెలుసుకుని ట్వీట్ ను డిలీట్ చేశారు.