కేసీఆర్ సలహాతోనే ఏపీకి మూడు రాజధానులు : వీహెచ్
By రాణి Published on 21 Jan 2020 3:45 PM ISTఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులుండాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. దేశంలో ఎక్కడా మూడు రాజధానుల విధానం లేదని, దీని వల్ల ప్రజాధనం వృథా అవుతుందే తప్ప లాభం లేదన్నారు. కేవలం స్వలాభం కోసం రాజధాని వికేంద్రీకరణ చేయాలనుకోవడం పద్ధతి కాదని ఆయన ఎద్దేవా చేశారు. అయినా ఏపీ ప్రత్యేక హోదాకే నిధులు లేనప్పుడు 3 రాజధానుల అభివృద్ధికి నిధులెలా వస్తాయని వీహెచ్ ప్రశ్నించారు. కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల వల్ల ఎన్నివేల రైతులు నష్టపోతున్నారో..ఎన్నివేలమంది రోడ్డున పడుతున్నారో జగన్ కంటికి కనిపించడం లేదా అని వీహెచ్ ప్రశ్నించారు.
సోమవారం ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును అధికార పార్టీ అసెంబ్లీలో పాస్ చేసింది. మంగళవారం ఈ బిల్లును మండలిలో పాస్ చేయాల్సి ఉండగా..వైఎస్సార్సీపీకి బలం సరిపోలేదు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు 28 మంది ఉండగా..వైసీపీ సభ్యులు కేవలం 9 మందే ఉన్నారు. మిగతా ఎమ్మెల్సీలు బీజేపీ, స్వతంత్రులు. వీరిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎవరి ఊహకి అందనివిధంగా మంగళవారం తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మంత్రి బుగ్గన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ..టీడీపీ సభ్యులు దానిపై చర్చకు ఇష్టపడలేదు. రూల్ 71 ప్రకారం బిల్లుపై చర్చ జరిపి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టినా లాభం లేదు. దీంతో ప్రభుత్వం మండలిని రద్దు చేసే దిశగా యోచనలు చేస్తోంది. కానీ..పార్లమెంట్ ఆమోదం లేనిదే మండలిని రద్దు చేయలేరని, ఇందుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని టీడీపీ మండలి పక్షనేత యనమల తెలిపారు.