ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో శాఖాహారంతో పాటు మాంసాహారం భుజించే వారు అధికంగా ఉంటారు. మరీ ముఖ్యంగా భారత దేశంలో అధిక శాతం ప్రాంతాల్లో ఆదివారం వస్తేచాలు మెనూలో ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. దేశంలోని కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో అధికశాతం శాఖాహారులు ఉన్నా.. కొందరైన మాంసాహారులు ఉంటారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా మాంసాహారం తినే దేశాల్లో భారత్‌ కూడా ముందు వరుసలోనే ఉంటుంది. అలాంటి భారత్‌లోనే ప్రపంచంలో తొలి శాఖాహార నగరం ఉందంటే నమ్ముతారా..? కేవలం అక్కడ శాఖాహారులు మాత్రమే ఉంటారు. అది ఎక్కడో కాదు.. స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రమైన గుజరాత్‌లోనే.

Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

ఆ రాష్ట్రంలోని భావనగర్‌ జిల్లాలో ఉన్న పాలిటానా అని ఒక చిన్న నగరం ఉంది. అది గుజరాత్‌లోనే అత్యధికంగా హిందువులు ఉండే రాష్ట్రం. మర్వాడీలు, జైనులు ఇతర మతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటారు. అయితే జైన మతస్తులు శాఖాహారులు. వారు జంతు హింసను ప్రోత్సహించరు. చివరకు చీమలు, క్రిములు కూడా నోట్లోకి వెళ్తే జంతుబలి చేసినట్లు భావించి నోటికి గుడ్డకట్టుకుంటారు. అలాంటి వారు నివసించే నగరమే ఈ పాలిటానా. జైనులు ఆ నగరాన్ని ఎంతో స్వచ్ఛంగా, పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నారు. ఈ నగరంలో జంతువులను చంపడం చట్ట విరుద్దం, గుడ్లు, మాంసం విక్రయాలు కూడా పూర్తిగా నిషేధం.

Also Read :రెండోసారి కరోనా నిర్దారణ పరీక్ష.. ఆశ్చర్యపోయిన ట్రంప్‌..!

2014 సంవత్సరంలో తొలిసారిటా పాలిటానా ప్రాంతంలో జంతువుల వధపై పూర్తిగా నిషేధం విధించారు. అప్పటి నుండి ఇక్కడ ఒక్క జంతువును కూడా బలి చేయలేదు. అప్పట్లో ఆ ప్రాంతంలో సుమారు 200 మంది సన్యాసులు జంతువుల బలిని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసి ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో జంతువు వధతో పాటు మాంసాహారం వినియోగాన్ని కూడా నిషేధించారు. వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోని కూడా ఇక్కడ మాంసాహారం వండటం నిషేధం. గతంలో ఆ ప్రాంతంలో మొత్తం 250 మాంసాహార దుకాణాలను మూసివేశారు. ప్రస్తుతం ఆ నగరంలో మాంసం ఎక్కడా కనిపించడం లేదు. పూర్తి శాఖాహార ప్రాంతంగా గుర్తించారు. కేవలం అక్కడ పాల ఉత్పత్తులను మాత్రమే అనుమతించారు. అక్కడి ప్రజలు పాలు, నెయ్యి, వెన్న మొదలైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రాంతంలో వందలాది దేవాలయాలు ఉండటంతో కూడా ఈ ప్రాంతాన్ని దైవ నిలయంగా భావిస్తూ పాలిటానాలో మాంసాహారం బంద్‌ చేయించారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం ప్రపంచంతో పాటు దేశంలోనే తొలి శాఖాహార నగరంగా గుర్తింపు పొందింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్