కోవిడ్ 19 విరుగుడుకు 18 నెలలు..

By రాణి  Published on  12 Feb 2020 7:58 AM GMT
కోవిడ్ 19 విరుగుడుకు 18 నెలలు..

కోవిడ్ 19 (కరోనా వైరస్) కు విరుగుడు మందు కనిపెట్టడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ)సంచలన ప్రకటన చేసింది. కోవిడ్ కు విరుగుడు మందు ఎవరు కనిపెడతారా అని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తుంటే..డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటన ఆయా దేశాల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది. కాగా..కోవిడ్ 19 కు సంబంధించిన మూనాలను వివిధ దేశాలతో పంచుకుని దాని నివారణకు కావాల్సిన టీకాలను, మందులను పరిశోధించడాన్ని మరింత వేగవంతం చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ రెండ్రోజుల పాటు సమావేశమయింది. 2019 డిసెంబర్ బయటపడిన ఈ వైరస్ కు టీకా అందుబాటులోకి తీసుకురావడానికి కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు. టీకా కనిపెట్టేంతవరకూ వైరస్ తో పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచానికి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ వైరస్ ను నంబర్ వన్ ప్రజా శత్రువుగా చూడాలన్నారు.

ఒక ఉగ్రదాడి వల్ల కలిగే నష్టానికన్నా..ఈ వైరస్ సృష్టించే బీభత్సం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను కకావికలం చేస్తుందని గెబ్రెయేసస్ మరోసారి చెప్పుకొచ్చారు. అలాగే 30 దేశాల్లో ఉన్న ప్రజలు బలహీన ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉండటంతో ఇది అక్కడ మరింత విజృంభించే ప్రమాదం కూడా ఉందన్నారు. కాబట్టి ఆయా దేశాలు పటిష్టమైన చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తి చెందకుండా తిప్పికొట్టాలని సూచించారు.

Next Story