‘వి’ టీమ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

By సుభాష్  Published on  11 Sep 2020 6:23 AM GMT
‘వి’ టీమ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

‘వి’ సినిమా మీద ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఆ చిత్రం విఫలమైంది. ఈ విషయంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో పాటు అందరినీ తిట్టుకున్నారు జనాలు. అదే సమయంలో ఆ చిత్ర బృందం తమ బాధ్యత మరిచిపోకపోవడాన్ని అభినందించాల్సిందే. ‘వి’ మీద సోషల్ మీడియాలో ఎంతగా నెగెటివిటీ కనిపించిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాను ఓ రేంజిలో ట్రోల్ చేశారు. మీమ్స్ తయారు చేశారు. ఆ నెగెటివిటీ తర్వాత సినిమా చూసిన వాళ్లు మరీ అంత చెత్తగా ఏమీ లేదే అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే ఈ నెగెటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా చిత్ర బృందం సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తోంది. కరోనా వల్ల బయటికెళ్లి ప్రమోషన్లు చేసే పరిస్థితి లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం టీం అంతా యాక్టివ్‌గా ఉంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఇంతకుముందు ఓటీటీలో నేరుగా రిలీజైన సినిమాల సంగతి చూస్తే.. చాలా వరకు వాటి నిర్మాతలు సినిమాను అమ్మేశాక రిలీజ్ ముంగిట మొక్కుబడిగా కొంత ప్రమోషన్ చేసి.. రిలీజ్ తర్వాత చేతులు దులిపేసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ అయితే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లతో వసూళ్లు పెంచడానికి ఆస్కారముంటుంది. సినిమాకు ఎంత నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి, బయ్యర్లను బయటపడేయడానికి ప్రయత్నిస్తారు. ఓటీటీల విషయంలో ఇలా ఆలోచించట్లేదు చాలామంది. సినిమా రిలీజయ్యాక అడ్రస్ ఉండట్లేదు. ప్రమోషన్ల ఊసే ఎత్తట్లేదు. ఐతే ‘వి’ టీం మాత్రం బాధ్యత మరిచిపోకుండా సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. ఇందులో దర్శకుడితో పాటు ప్రధాన తారాగణం పాలుపంచుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌‌లో నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలకు అది కలిసొస్తుంది. వాటికి మంచి డీల్స్ రావడానికి ఉపయోగపడుతుంది.

Next Story