బిగ్‌బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి
By సుభాష్ Published on 16 May 2020 7:23 AM ISTముఖ్యాంశాలు
రెండు ట్రక్కులు ఢీకొని 23 మంది మృతి
పలువురికి గాయాలు
కొందరి పరిస్థితి విషమం
వారంతా వలస కూలీలు..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని చేస్తేనే వారికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే పస్తులుండాల్సిందే. అలాంటిది వారిని మృత్యువు వెంటాడింది. లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమవుతున్న వలస బతుకులకు రోడ్డు ప్రమాదంలో చావుదెబ్బ కొట్టింది. కానరాని లోకాలకు తీసుకెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా వాళ్ల పరిస్థితి దారుణంగా తయారై వెలుగులు లేకుండా ఉంటే.. ఇక శాశ్వతంగా లేకుండా చేసేంది రోడ్డు ప్రమాదం. ఈ హృదయవిదారకరమమైన ఘటన అందరిని కలచివేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 23 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం యూపీలోని ఔరాయ జాతీయ రహదారిపై జరిగింది. వలస కూలీలు వెళ్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తోంది. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.