ఉక్రెయిన్ ప్రధాని రాజీనామాకు నో

By సుభాష్  Published on  19 Jan 2020 3:35 AM GMT
ఉక్రెయిన్ ప్రధాని రాజీనామాకు నో

ఉక్రెయిన్ ప్రధాని వోలెక్సీ గోంచారక్‌ రాజీనామాను అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ తిరస్కరించారు. ప్రధానిగా కొనసాగడానికి అవకాశం ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందుతున్న ముఖ్యమైన సమస్యలు పరిష్కరించగలిగితే ఒక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తమ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీకి అంతగా అవగాహన లేదంటూ ఉక్రెయిన్ ప్రధాని వోలెక్సీ గోంచారక్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకొచ్చాయి.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశంలోని బ్యాంకు అధికారులు, ఆర్థికవేత్తలతో ఇటీవల అధ్యక్షుడు వ్లోదిమిర్ సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం వోలెక్సీ తన సహచరులతో మాట్లాడుతూ.. అధ్యక్షుడు వ్లోదిమిర్ ఓ కమెడియన్ అని, ఆర్థిక వ్యవస్థపై ఆయనకు అవగాహన లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవం లేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులు తాజాగా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. దీంతో స్పందించిన వోలెక్సీ తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అధ్యక్షుడికి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, వోలెక్సీ రాజీనామాను అధ్యక్షుడు తిరస్కరించారు. ఆయనకు మరో అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు.

Next Story