హిందూ దేవాలయాన్ని సందర్శించిన యూకే ప్రధాని 'బోరిస్ జాన్సన్'

By Newsmeter.Network  Published on  9 Dec 2019 11:23 AM GMT
హిందూ దేవాలయాన్ని సందర్శించిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

ముఖ్యాంశాలు

  • లండన్ స్వామినారాయణ్ దేవాలయాన్ని సందర్శించిన యూకే ప్రధాని
  • సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్దతు కోరేందుకు ఆలయ సందర్శన
  • భారతీయ సంతతితో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న యూకే ప్రధాని
  • భవిష్యత్తులో భారత ప్రధానితో కలసి పనిచేస్తామన్న బోరిస్ జాన్సన్
  • పట్టుచీర కట్టుకుని ఆలయాన్ని దర్శించిన యూకే ప్రధాని అర్ధాంగి
  • ప్రధాని దంపతులతోపాటుగా ఆలయానికి వచ్చిన హోం సెక్రటరీ ప్రీతి పాటిల్
  • ఆలయ ప్రముఖ్ మహరాజ్ 98వ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన బోరిస్

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తన భార్య క్యారీ సైమండ్స్ తో కలసి లండన్ లోని స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంగ్లండ్ లో స్థిరపడిన భారతీయుల ఓట్లను అభ్యర్థించేందుకు ఆయన ఈ పని చేశారు. భవిష్యత్తులో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలసి భారతదేశ అభివృద్ధి కోసం సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆయన ఈ సందర్భంగా యూకేలోని భారతీయ సంతతికి హామీ ఇచ్చారు.

యూకేలోని ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఒకటైన స్వామినారాయణ్ మందిర్ ను యూకే ప్రధాని దంపతులు సందర్శించడం ఇంగ్లండ్ లోని భారతీయ సంతతివారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సతీమణి సైమండ్స్ గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని స్వామినారాయణ్ మందిర్ కు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ముప్ఫై ఒక్క సంవత్సరాల ఈ మహిళ భారతీయ ఆహార్యంలో కనిపించడం తన జీవితంలో ఇదే మొదటిసారి.

భారత్ ను ఒక సమున్నత శక్తిగా

భారత ప్రధాని నరేంద్రమోడీ భారత్ ను ఒక సమున్నత శక్తిగా తీర్చి దిద్దేందుకు అహర్నిశం శ్రమిస్తున్నారని, అందుకోసం ఆయన పడుతున్న శ్రమను ప్రపంచం అంతా గుర్తిస్తోందని బోరిస్ జాన్సన్ అన్నారు. తమ దేశంలో ఉన్న భారతీయుల సహయోగం తమ దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పనిసరిగా భవిష్యత్తులో నరేంద్రమోడీతో కలసి ఇరు దేశాల అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనకైనా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని యూకే ప్రధాని స్వామి నారాయణ్ మందిరంలో ప్రమాణం చేశారు.

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బోరిస్ జాన్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ రిపబ్లికన్ పార్టీకంటే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పక్కాగా భారతీయ సంతతికి చెందినవారి ఓట్లు పడితే విజయం తథ్యమని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. ఆ కారణంగానే యూకే ప్రధాని తన సతీమణితో కలసి స్వామి నారాయణ్ మందిర్ ని సందర్శించారు.

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత లేబర్ పార్టీ భారతీయులకు వ్యతిరేకంగా పనిచేసేందుకు నిర్ణయించుకుందన్న అనధికారిక వార్తలు ఇప్పుడు యూకేలో విస్తృత స్థాయిలో ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకేలో ఉన్న భారతీయ సంతతిని ఆకట్టుకోవడం వల్ల కచ్చితంగా ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయన్న ఆలోచనతో బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

గతంలోకూడా బ్రిటిష్ ఇండియెన్స్ కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో విజయాన్ని సాధించడంలో అనేకమార్లు కీలకమైన పాత్రను పోషించారు. బోరిస్ జాన్సన్ ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీతో ప్రస్తావించినప్పుడు ఆయన నవ్వుతూ భారతీయులు ఎప్పుడూ విజయ పథంలోనే సాగుతారని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.

బ్రిటిష్ ఇండియన్ల సహకారం

లండన్ లోని స్వామి నారాయణ్ సంస్థాన్ ప్రముఖ్ గా ఉన్న స్వామీజీ 98వ పుట్టిన రోజు వేడుకలకు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన సతీమణి, హోం సెక్రటరీ ప్రీతి పాటిల్ హాజరు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తప్పనిసరిగా యూకే ప్రధానికి ఎన్నికల్లో బ్రిటిష్ ఇండియన్ల సహకారం పూర్తిగా అందుతుందని భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు హామీ ఇచ్చారు.

భారతీయ సంతతి తమ దేశానికి ఇచ్చిన మహోత్తరమైన కానుకల్లో లండన్ లోని స్వామి నారాయణ్ ఆలయానికి ప్రథమ స్థానం దక్కుతుందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. సుహృద్భావ భావనలను పెంపొందించడానికి ఈ ఆలయం ఎంతగానో దోహద పడుతోందంటూ ఆయన కొనియాడారు. ఆలయం తరఫున జరుగుతున్న మహోన్నతమైన సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఎంతగానో ప్రశంసించారు.

యూకే ప్రధాని దంపతులతోపాటుగా ఈ కార్యక్రమానికి హాజరైన బ్రిటిష్ హోం సెక్రటరీ ప్రీతి పాటిల్ కూడా పట్టుచీరను ధరించి సంప్రదాయ రీతిలో వేడుకలకు హాజరవడం అందరినీ ఆకట్టుకుంది. బ్రిటిష్ ప్రధాని దంపతులతోపాటుగా ఆమెకూడా స్వామి నారాయణ్ సంస్థాన్ ప్రముఖ్ మహరాజ్ ఆశీర్వాదాన్ని అందుకున్నారు. భారత్ సహా ప్రపంచంలోని ఇతర దేశాలనుంచి ఇంగ్లండ్ కి వచ్చేవారికోసం ఇమ్మిగ్రేషన్ సౌకర్యాల్లో విస్తృత స్థాయి మార్పులు కల్పించి సౌలభ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు.

అందరినీ కలుపుకుపోయే మనస్తత్త్వం వల్లే కన్జర్వేటివ్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నోమార్లు సార్వత్రిక ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేసిందని ఆమె వ్యాఖ్యానించారు. భారతీయ సంతతికి చెందిన తను హోం సెక్రటరీ స్థాయిలో బాధ్యతల్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులోకూడా భారతీయ సంతతికి చెందిన మరికొందరు ప్రముఖులు యూకే అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే అవకాశం ఉందని చెప్పారు. అదే విధంగా యూకే తరఫునుంచి పూర్తి స్థాయిలో భారత్ అభివృద్ధికోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయని ఆమె హామీ ఇచ్చారు.

ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను తమ దేశంలోకి తీసుకురావడానికి మార్గం సుగమమయ్యిందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులోకూడా ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ ఎక్కడ ఉన్నా దాన్ని అన్ని విధాలుగానూ ప్రోత్సహించేందుకు తమ దేశ పురోభివృద్ధిలో మేధావులకు స్థానం కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Next Story