కేంద్రమంత్రి - చరిత్రకారుడి మధ్య ట్విట్టర్ వార్
By రాణి Published on 14 Feb 2020 2:25 PM IST- నెహ్రూ - సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని కోరుకోలేదు : జైశంకర్
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, చరిత్ర కారుడు రామచంద్ర గుహ.. ట్విట్టర్ లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇది దాదాపు రెండు రోజుల పాటు సాగింది. నెహ్రు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని అనుకోలేదని జయశంకర్ చెప్పగా.. దాన్ని రామచంద్ర గుహ తప్పు పట్టారు. కావాలంటే చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుకోవండని ఒకరినొకరు విమర్శించుకున్నారు.
లార్డ్ మౌంట్బాటన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్ద అప్పట్లో పనిచేసిన వి.పి.మీనన్ రాసిన పుస్తకాన్ని జైశంకర్ బుధవారం నాడు ఆవిష్కరించారు. సివిల్ సర్వెంట్ అయిన మీనన్ రాసిన పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను కోట్ చేస్తూ జైశంకర్ ట్వీట్ చేశారు. తన కేబినెట్లో పటేల్‌ను తీసుకోవడానికి నెహ్రూ విముఖత చూపారంటూ ఒక పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ జైశంకర్ ట్వీట్ చేశారు. పటేల్‌ను మంత్రిగా తీసుకోవడం నెహ్రూకు ఇష్టం లేదనీ, 1947లో నెహ్రూ తన కేబినెట్ తొలి జాబితాలో సర్దార్ పేరును చేర్చలేదన్న విషయం ఈ పుస్తకం ద్వారా తనకు తెలిసిందని జైశంకర్ ట్వీటు చేశారు. సర్దార్ పటేల్ చనిపోయాక ఆయనకు సంబంధించిన చరిత్రను తుడిచివేయడానికి చాలా వరకూ ప్రయత్నించారని మీనన్ తన పుస్తకంలో రాయగా దాన్ని జైశంకర్ ట్వీట్ చేశారు.
జైశంకర్ చేసిన ట్వీట్ ను రామచంద్ర గుహ తప్పుబట్టారు. ఇవన్నీ ఊహాగానాలు తప్ప మరేవీ కావని.. వీటన్నిటికీ ప్రొఫెసర్ శ్రీనాథ్ రాఘవన్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారని గుహ అన్నారు. ఒకరికి ఒకరు పడలేదంటూ చెప్పాల్సిన అవసరం విదేశాంగ శాఖ మంత్రికి ఏమి అవసరం ఉందని.. ఆ పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యతలు చాలా ఉంటాయని రామ చంద్ర గుహ చెప్పుకొచ్చారు. ఇటువంటి విషయాలను బీజేపీ ఐటీ సెల్ కు ఇచ్చేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు జైశంకర్ రెండు గంటల్లోనే రిప్లై ఇచ్చారు. "కొందరు విదేశాంగ మంత్రులు పుస్తకాలు కూడా చదువుతారని.. కొందరు ప్రొఫెసర్లకు ఇదో మంచి అలవాటు కూడా అని.. వీలైతే తాను విడుదల చేసిన పుస్తకాన్ని చదవమని కోరుతానని" కౌంటర్ ఇచ్చారు. దీనికి వెంటనే రామచంద్ర గుహ స్పందించారు. 'తన కేబినెట్ లో చేరాలంటూ అప్పట్లో నెహ్రు.. పటేల్ కు రాసిన ఉత్తరానికి సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. ఈ లెటర్ ను ఎవరైనా జయశంకర్ కు చూపించాలంటూ కోరారు. అలాగే మరికొన్ని పుస్తకాలు చదవాలని కోరారు.