చనిపోయిన కూతుర్ని రియాలిటీ షోలో కలుసుకున్న తల్లి.. టెక్నాలజీ ద్వారా అద్భుతం
By సుభాష్
ముఖ్యాంశాలు
ఈ షో ద్వారా కోల్పోయిన తమ వారిని కలుసుకునే అవకాశం
వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానంతో సాధ్యం
ఇది తప్పంటున్న కొందరు వైద్యులు
మూడేళ్ల కిందట కూతురు చనిపోయింది.. బిడ్డను తలచుకుంటూ తల్లిడిల్లుతోంది తల్లి. శాశ్వతంగా దూరమైన కుమార్తె ఒక్కసారిగా తల్లి ముందు ప్రత్యక్షమైంది. అమ్మా.. అంటూ మాట్లాడింది. అమ్మ నిన్ను మిస్సవుతున్నా.. అచి చెప్పింది. మూడేళ్ల కిందట దూరమైన కూతురు ఒక్కసారిగా తల్లి చూస్తే.. ఆ ఆనందం చెప్పలేనిది. కూతురును చూడగానే కన్నీళ్లు కార్చింది. కన్నీళ్లు కారుతున్నా పాపను చేతపట్టుకుని తనివితీరా నిమిరింది. చెబుతున్నది ఇదేదో సైన్స్ సినిమాలో, లేక ఓ కథనో కాదు. టెక్నాలజీ అసాధ్యాలను సుసాధ్యం చేసిన అద్భుతం.
అమ్మ కలలకే పరిమితమైపోయిన ఓ పాప 'వర్చువల్'గా కంటి ముందు నిలిపింది. 'మీటింగ్ యు' పేరుతో కొరియాకు చెందిన ఒక టీవీ చానల్ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది. ప్రపంచాన్ని కంటతడి పెట్టేలా చేసింది.
'వర్చువల్ రియాలిటీ' టెక్నాలజీతో వారు తల్లీబిడ్డలను కలపగలిగారు. కొరియా దేశానికి చెందిన జాంగ్ జి సింగ్ అనే మహిళకు నేయోన్ అనే కూతురు ఉంది. కుమార్తె ఏడు సంవత్సరాలు ఉండగా అంటే 2016లో పాప ఓ అంతుచిక్కని వ్యాధితో మరణించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి కూతురు జ్ఞాపకాలతోనే బతుకుతూ తల్లడిల్లిపోతోంది. ఈ క్రమంలో కొరియాకు చెందిన ఎంబీసీ అనే చానల్ 'మీటింగ్‌యు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాంగ్ జి సంగ్ తలకు వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్, కూతురు డిజిటల్ అవతార్ స్పర్శ తెలిసేలా ఆమె చేతులకు టచ్ సెన్సిటివ్ గ్లవ్స్ అమర్చారు. ఆ హెడ్‌సెట్ తగిలించుకునే సంగ్ కళ్లముందు ఒక డిజిటల్ ప్రత్యక్షమైంది. అక్కడ ఊదా రంగు గౌను ధరించి మెరిసే కళ్లతో చూస్తూ కుమార్తె కనపడింది అమెకు.
ఇన్ని రోజులూ ఎక్కడున్నావమ్మ..?
తల్లి కళ్ల ముందు కనబడిన కుమార్తెను చూస్తూ..ఇన్ని రోజులూ ఎక్కడున్నావమ్మా..? నా గురించి నువ్వు ఎప్పుడైన ఆలోచించావా..?నేను ఎప్పుడైన గుర్తుకు వచ్చానా..? అని చిన్నారి నేయోన్ ముద్దు ముద్దుగా మాటలతో అడిగింది. నీ గురించి ఆలోచించని క్షణం లేదమ్మా.. అని తల్లి సమాధానం ఇచ్చింది. దానికా పాప కూడా.. నేను కూడా అమ్మమీద బెంగపడ్డాను అని తెలిపింది.
ఎప్పుడో మరణించిన కుమార్తె డిజిటల్ అవతార్ కళ్ల ముందు కనిపిస్తుంటే సంగ్ తాకేందుకు ఆలోచించింది. చివరికి కన్నీటితో ఆ చిన్నారి చేతిని పట్టుకుంది. చూశావా అమ్మా.. నాకిక్కడ ఏ బాధా లేదు.. అని చిన్నారి చెప్పగా, తర్వాత సంగ్ తన పాప పుట్టిన రోజు వేడుకలు జరిపింది. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. చివరకు తాను అలసిపోయానంటూ అమ్మకు గుడ్‌బై చెప్పి పడుకుంది. తర్వాత ఓ అందమైన సీతాకొక చిలుకగా మారిపోయింది. దాదాపు 8 నిమిషాల పాటు జరిగిన ఈ షోను అక్కడే ఉన్న సంగ్ భర్త, ఇద్దరు పిల్లలు చూశారు. వారు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. కాగా, ఇలా అయిన వారిని దూరం చేసుకుని తల్లడిల్లుతున్న వారికి సాయం చేసేందుకు తాను ఈ డాక్యుమెంటరీలో పాల్గొనేందుకు ఒప్పుకొన్నానని సంగ్ తెలిపింది. ఇది కొరియన్ టీవీకి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు.. ఆప్తులను దూరం చేసుకున్న వారు ఎవరైనా ఈ టెక్నాలజీ ద్వారా కలిసే అవకాశం ఉంది. కొందరు వైద్యులు మాత్రం ఇలా చనిపోయిన వారి డిజిటల్ అవతార్‌లను సృష్టించం వల్ల నైతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైతికంగా ఇలా చేయడం తప్పవని, ఇలాంటివి మంచివి కాదని హెచ్చరిస్తున్నారు.
ఇంత చక్కగా కూతురి వర్చువల్ డిజిటల్ గ్రాఫిక్ బొమ్మను కొరియాకు చెందిన మున్వా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తయారు చేసింది. పాప రూపం, హైట్, బాడీ, మాట అన్ని చనిపోయిన పాపలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ షో చూసిన నేయోన్ తండ్రి, సోదరుడు, సోదరి కూడా తల్లిలాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదో మేజికల్ జర్నీలా ఉందని చెప్పుకొచ్చారు.
రియాలిటీ షోను తప్పుబడుతున్న సైకాలజీ నిపుణులు
ఈ రియాలిటీ షోను సైకాలజీ నిపుణులు తప్పుబడుతున్నారు. పైగా ఇది ప్రయోజనం కలిగించేలా ఉన్నా.. దీన్ని టీవీ ఛానెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఇలా చేయడం సరైందని కాదని అంటున్నారు. అయితే పాప తల్లి జాంగ్ జి సంగ్ మాత్రం షోపై వస్తున్నవిమర్శలను సైతం కొట్టిపారేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్‌తో తన కుమార్తెను చూసి ఫీల్ పొందానని, తన కూతురు లాంటి ఆకారం తనతో మాట్లాడుతూ గడ్డిలో ఆడుకుంటూ చక్కగా నిద్రపోతుంటే తనకు కలిగినానందం మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చింది.
ఇందులో తప్పుబట్టేది ఏమి లేదు
ఈ ప్రయోగాన్ని చూసిన నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయినవాళ్లను కోల్పోతే కలిగే బాధను అలాగే భరిస్తూ బతికేకంటే ఇలాంటి వర్చువల్ రియాలిటీ షో ద్వారా కొంతైనా తగ్గించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇందులో ఎవరిని తప్పుబట్టాల్సిన పని లేదంటున్నారు. ఈ షో కోసం ఇంతలా ఖర్చు చేసిన ఆ టీవీ ఛానెల్ అందరికి చూపించి పెట్టిన ఖర్చులను రాబట్టేందుకు ప్రయత్నిస్తే తప్పేముందని అంటున్నారు. ఇలాంటి షోను చూసిన తర్వాత తమ వారిని కోల్పోయిన వారు ఇలా చూసుకునేందుకు ముందుకు వస్తారని అంటున్నారు.