హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య
By సుభాష్ Published on 9 Sept 2020 8:20 AM ISTటాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురనగర్ హెచ్ 56 బ్లాక్ రెండో ఫ్లోర్‌లో శ్రావణి నివసిస్తోంది. గత 8 సంవత్సరాలుగా తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్నారు. 'మౌనరాగం', 'మనసు మమత' లాంటి పలు సీరియల్స్‌లో ఆమె నటిస్తున్నారు. అయితే టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డి తో వేధింపులు ఉన్నట్లు సమాచారం.
మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డి కొన్ని రోజులుగా శ్రావణిని వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమని ఆమె తల్లి పాపరత్నం ఆరోపిస్తున్నారు. భాగ్యరేఖ సీరియల్‌లో నటిస్తున్న దేవరాజ్.. శ్రావణి ద్వారానే సీరియల్స్‌లోకి వచ్చాడని అన్నారు. పరిచయం అయినప్పటి నుంచి వేధింపులకు గురి చేశాడని, నా కూతురును దేవరాజ్ మానసికంగా వేధించాడని ఆరోపించారు. గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు పాపరత్నం పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా స్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.