పెరగనున్న కలర్ టీవీల ధరలు
By సుభాష్
టీవీలు కొనేవారికి ఇది షాకింగ్ న్యూసే. దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వస్తున్న నిత్యావసరం కాని వస్తువులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కలర్ టీవీల ధరలు పెరగనున్నాయి. అయితే ఇప్పటి వరకు కలర్ టీవీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై వాటి నియంత్రణ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ విభాగం ప్రకటించింది.
ఇందులో భాగంగా 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీ మీటర్ల పరిణామంలో ఉన్న టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్‌సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. ఇక వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్‌టీ పొందాల్సి ఉంటుంది. ఒకప్పుడు రూ.30వేలు పెడితే కానీ 32 ఇంచుల ఎల్‌ఈడీ వచ్చేది కాదు. కానీ ఎంఐ, వీయూ, కొడాక్ వంటి కంపెనీలు వచ్చాక టీవీ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు రూ.10వేలకే 32 ఇంచుల ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ దొరుకుతుంది. ఇక నుంచి ఇంత తక్కువ ధరలకు టీవీలు దొరికే అవకాశాలు ఉండవు. దీంతో రానున్న రోజుల్లో కలర్ టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.