సిరియాలో ఆరని చిచ్చు

By సత్య ప్రియ  Published on  11 Oct 2019 8:14 AM GMT
సిరియాలో ఆరని చిచ్చు

సిరియా ఉత్తర భాగాన ఉన్న టర్కీ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున యుద్ధం జరుగుతోంది. కుర్దుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో టర్కీ రెండు రోజులుగా దాడులు జరుపుతోంది. సిరియా సరిహద్దుల నుంచి కుర్దూ దళాలను తరిమికొట్టేందుకు వైమానికా దాడులు చేస్తొంది.

టర్కీ దాడులతో పౌరులు భయపడిపోతున్నారనీ, పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పై నుంచి కురుస్తున్న బాంబులతో రోడ్లు దెబ్బతినిపోయాయని యుద్ధాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న విలేఖరులు చెప్తున్నారు. ఎక్కడి కక్కడ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలకు ఎటువెళ్లాలో దిక్కుతోచని స్థితిలో కుటుంబాలకు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే, కుర్దూ మిలిటెంట్లను తరిమేసి సరిహద్దు ప్రాంతాల్ని సురక్షిత ప్రాంతంగా చేయాలన్నదే తమ ఉద్దేశ్యం అనీ, టర్కీలో ఆశ్రయం పొందుతున్న లక్షలమంది సిరియా శరణార్ధుల్లో కొందరినైనా తమ స్వంత దేశానికి చేరుస్తామనీ టర్కీ అధికారులు చెబుతున్నారు.

1570735884.turkey

టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తాము సుమారు 181 కుర్దిష్ స్థావరాలను ధ్వంసం చేసామని సమాచారం అందించాయి. కుర్దిష్‌ల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నామని టర్కీ చెబుతున్నప్పటికీ సరిహద్దును ఆనుకుని వున్న పౌర ఆవాస ప్రాంతాలపై కూడా బాంబులు పడి పెద్దయెత్తున విధ్వంసం చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి

సిరియాపై దాడిలో తనకు సహకరించిన కుర్దిష్‌ తిరుగుబాటుదారులను అర్ధాంతరంగా విడిచిపెట్టి అమెరికా తన దళాలను ఉపసంహరించడంతో టర్కీ పని సులువైంది. కుర్ధులను అణచివేసేందుకు టర్కీ చాలా కాలంగా పోరాడుతోంది. తమ బలగాలను ఉపసంహరించుకొని అమెరికా తమకు కుర్దూ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు.

టర్కీ దాడిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఖండించాయి. అమెరికా, యూరోపియన్‌ దేశాలు టర్కీ చర్యను విమర్శించాయి. దీనిపై ఆగ్రహించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ టర్కీ తన గేట్లు తెరిస్తే లక్షల మంది సిరియా శరణార్థులు యూరపు దేశాల్లోకి ప్రవేశిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో సిరియాపై టర్కీ చేస్తున్న ఏకపక్ష సైనిక దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించింది. చర్చల ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది.

Next Story