టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధాని అంకారాకు 750 కి.మీ దూరంలో ఉన్న ఎలాజిగ్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 8:55గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 6.8 గా నమోదైంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయపడ్డారు. 30 మంది పైగా గల్లంతైనట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.

భూకంపం తర్వాత మరో 60 సార్లు స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం శ్రమిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలిస్తోంది.

Turkey earthquakeభూ ప్రకంపనల ధాటికి ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత భారీగా ఉండడంతో భవనాలు, నివాసాలు భారీ ఎత్తున ధ్వంసమయ్యాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పొరుగు దేశాలలైన సిరియా, లెబనాన్‌లోనూ ప్రకంపన తీవ్రత ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. 1999లో టర్కీలోని ఇజ్‌మిత్‌ సిటీలో చోటుచేసుకున్న భారీ భూకంపం దాటికి దాదాపు 17వేల మంది మృత్యువాత పడ్డారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.