జ‌గ‌న్ బాబాయ్‌కు ఎదురుదెబ్బ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 3:33 AM GMT
జ‌గ‌న్ బాబాయ్‌కు ఎదురుదెబ్బ

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏపీలో బంపర్ విక్టరీ కొట్టింది. 175 సీట్లలో ఏకంగా 151 సీట్లను గెలుచుకుందంటే.. ఆ పార్టీ సాధించిన విక్టరీ ఆషామాషీ కాదనే చెప్పాలి. అయితే ఈ విక్టరీ తర్వాత గడచిన ఏడాది కాలంలో వైసీపీ సర్కారుకు ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నికలకు ముందు జగన్ చేసిన బాసలకు జనం నుంచి ఏ మేర మద్దతు దక్కిందో?... ఇప్పుడు జగన్ అవే అంశాల మీద తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై నిరసన వ్యక్తమవుతోంది. నాడు ఓకే అన్న జనం నేడు నో అని ఎందుకు చెబుతున్నారు? నాడు నోరెత్తలేని విపక్షాలు.. నేడు నిరసనలను ఎందుకు హోరెత్తిస్తున్నాయి? దీనికంతటికీ ఒకే ఒక్క కారణం వినిపిస్తోంది. అదే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సమీక్షలు, కూలంకష చర్చలు లేకపోవడమే. నిజమే.. జగన్ సర్కారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ముందు వాటిపై పెద్దగా చర్చలు గానీ, సమీక్షలు గానీ జరగడం లేదన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. ఈ కారణంగానే జగన్ సర్కారు పలు కీలక నిర్ణయాల అమలులో వెనకడుగు వేయక తప్పదన్న మాట కూడా బలంగానే వినిపిస్తోంది.

తిరుమల వెంకన్న ఆలయానికి చెందిన పలు ఆస్తుల విక్రయానికి సంబంధించిన నిర్ణయంపై జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పెద్దగా చర్చలు చేయ‌లేద‌నే వాద‌నాలు ఉన్నాయి. అసలు ఈ వ్యవహారం టీడీపీ హయాంలోనే మొదలైనా... ఇప్పుడు దానిని అమలు చేసే విషయంలో జగన్ సర్కారు ఎలాంటి సమీక్ష చేయకుండా ముందుకు సాగడంతోనే చిక్కు వచ్చి పడిందని చెప్పక తప్పదు. శ్రీవారికి భక్తులు సమర్పించిన చిన్నపాటి ఆస్తులు నిరర్ధకంగా మారిన మాట వాస్తవమే అయినా.. విక్రయానికి సంబంధించి లోతైన సమీక్షతో జనానికి అర్థమయ్యేలా చెప్పి ముందుకు సాగి ఉంటే ఈ తరహాలో నిరసనలు వ్యక్తమయ్యేవి కాదనే చెప్పాలి. ఫలితంగా శ్రీవారి ఆస్తుల విక్రయంపై దూకుడుగా సాగినా.. చివరికి వెనకడుగు వేయక తప్పలేదు. ఇక తిరుమలకు చెందిన లడ్డూల విక్రయాలపైనా టీటీడీ దుందుడుకుగా, సమీక్ష లేకుండా ముందుకు సాగింది. తీరా నిరసనలు వ్యక్తమయ్యే సరికి వెనక్కు తగ్గక తప్పలేదు.

ఈ కోవలోకే సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం కూడా వస్తుంది. పేద పిల్లల విద్యకు కేంద్రాలుగా ఉన్న సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమంతో మంచే జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఈ విషయంలో గత టీడీపీ సర్కారు కూడా పలు సర్కారీ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టింది కూడా. అయితే ఇప్పుడు జగన్ సర్కారు సింగిల్ స్టెప్ తో మొత్తం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమంగా మార్చేస్తామని చెప్పడంతోనే అసలు చిక్కు వచ్చి పడింది. తెలుగుపై మమకారం ఉన్న వారికి మండలానికి ఒకటో, రెండో పాఠశాలల్లో అయినా తెలుగు మాద్యమాన్ని కొనసాగిస్తామని జగన్ సర్కారు చెప్పి ఉంటే బాగుండేదేమో. అలా జరగకపోవడంతో విపక్షాలతో పాటుగా పలు వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఆంగ్ల మాద్యమంపై నిరసన వ్యక్తం చేశారు. ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టడంపై జగన్ సర్కారు పెద్దగా కసరత్తు చేయని నేపథ్యంలోనే ఈ అనర్థం జరిగిందని చెప్పక తప్పదు. మొత్తంగా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జగన్ సర్కారు ఆయా అంశాలపై లోతైన సమీక్ష చేయని కారణంగానే ఇలా ప్రతి కీలక విషయంలో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story