సస్పెండ్ చేశారు కదా.. అవినీతి గురించి కేసీఆర్ దగ్గరకు తీసుకొని వెళ్తా..!

By రాణి  Published on  20 Feb 2020 10:04 AM GMT
సస్పెండ్ చేశారు కదా.. అవినీతి గురించి కేసీఆర్ దగ్గరకు తీసుకొని వెళ్తా..!

అవినీతి గురించి మాట్లాడడమే ఆయన చేసిన తప్పా..? అవకతవకలు జరుగుతున్నాయి.. ఇకనైనా ఆపండి అని చెప్పాలని ఆయన చేసిన ప్రయత్నమే ఇప్పుడు సస్పెన్షన్ కు దారి తీసిందా..? ఇంతకూ ఎవరాయన అని అనుకుంటున్నారా..?

ఆయన పేరు డి.కోటేశ్వర రావు, TSSPDCL లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. డిస్కంలో అవినీతి జరిగిందంటే చాలు అసలు ఒప్పుకోరు ఆయన. దీంతో కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ పెట్టిన ఆయన TSSPDCL లో అవినీతి జరుగుతోందని.. ఒక్క వ్యక్తికే 30 కోట్ల రూపాయల విలువజేసే 4,000కు పైగా వర్కులు ఇచ్చేశారని చెప్పారు. ఒక్క కాంట్రాక్టర్ కే నామినేషన్ బేసిస్ మీద అన్ని వర్కులు ఇవ్వడం చాలా తప్పు సార్ అని పై అధికారులను, ఇంజనీర్లను నిందించాడు. దీంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అదే ఆయన చేసిన తప్పుగా భావించి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడమే మీరు చేసిన తప్పు అని.. ఇది రూల్స్ ను అతిక్రమించడమేనని చెప్పారు.

ఫిబ్రవరి 4 న కోటేశ్వర రావు సంస్థ నిబంధనలు అతిక్రమించి ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు. కొందరు ఇంజినీర్లు అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆ వీడియోలో ఆరోపించారు. 4769 కాంట్రాక్టు పనులు TSSPDCL కాంట్రాక్టర్ ప్రదీప్ ఎలెక్ట్రికల్స్ కు మాత్రమే ఇచ్చారని ఆరోపణలు గుప్పించడం తప్పని అందుకే సస్పెండ్ చేస్తున్నామంటూ.. TSSPDCL ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘురామ రెడ్డి ఇష్యు చేసిన సస్పెన్షన్ ఆర్డర్ లో ఉంది. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే సపెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తారో చెప్పగలమని అధికారులు అంటున్నారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ ను వీడకూడదని ఆ సస్పెన్షన్ ఆర్డర్ లో ఉంది.

సస్పెన్షన్ వేటు పడడంపై కోటేశ్వర రావు స్పందించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని.. నేను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని అన్నారు. డిస్కంను కాపాడడమే తన లక్ష్యమని.. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దగ్గరకు తీసుకుని వెళ్తానని అన్నారు.

Next Story