మొబైల్ బయో టాయిలెట్స్ బస్సులు వచ్చేశాయ్..!
By రాణి Published on 28 Dec 2019 10:41 AM ISTతెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కోసం మొబైల్ బయో టాయిలెట్స్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజుల వరకు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమ ఫలితంగానే సీఎం కేసీఆర్ స్పందించారు. అందులో భాగంగానే 58 ఏళ్లు ఉన్న వారి వయోపరిమితిని 60కి పెంచారు. ఇందుకు సంబంధించిన జీవో ఇప్పటికే జారీ అయిన విషయం విధితమే.
తాజాగా, ఆర్టీసీ మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే ఆలోచనలో భాగంగా మొబైల్ బయో టాయిలెట్స్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ ఆదాయం మరింత పెరిగేలా అతి త్వరలో కార్గో, పార్శిల్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ ఉన్నతాధికారులు చెప్పారు. ప్రధానంగా ఎక్కడైతే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వారి డ్యూటీలు ఛేంజ్ అవుతారో అక్కడ ఇటువంటి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సు ముందు భాగంలో పురుషులకు, వెనుక భాగంలో స్త్రీలకు వేర్వేరుగా బయో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా సౌకర్యవంతమైన సీట్లను ఏర్పాటు చేయడంతోపాటు వాష్ బేసిన్, దుస్తులు మార్చుకునే వసతిని కూడా ఏర్పాటు చేశారు.
మొబైల్ బయో టాయిలెట్స్ బస్సులకు సంబంధించి రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో మంత్రి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరూ సమానమే. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే ప్రతి డిపో స్థాయిలోని ప్రజా ప్రతినిధులందరికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయమని, కార్మికులతో కలిసి వన భోజనాలు చేయాలని చెప్పా. కలిసి మెలిసి ఐకమత్యంగా పనిచేసి అంతిమంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే క్రమంలో మొబైల్ టాయిలెట్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. కార్గో బస్సులు ప్రస్తుతం తయారవుతున్నాయి. ఒక వంద బస్సులు తయారు కాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జనవరి నెలలో ప్రారంభించడం జరుగుతుంది. అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా 700 నుంచి 800 వరకు కార్గో బస్సులు తిరుగుతాయి. పార్శిల్ సర్వీసు బస్సుల్లో సున్నితమైన వస్తువులను తీసుకెళ్లేలా ప్రత్యేక అరను తయారు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో చెప్పుకొచ్చారు.