తెలంగాణ: పలు జిల్లాలో భారీ వర్షాలు

By సుభాష్  Published on  8 Oct 2020 6:16 AM GMT
తెలంగాణ: పలు జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి డాక్టర్‌ శ్రావణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడనం మారిన అనంతరం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆమె వివరించారు.

అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్‌ 9న ఏర్పడే మరో అల్పపీడనం ఏర్పడి అది 24 గంటల వ్యవధిలో వాయువ్య దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు.

Next Story