ఇలా అయితే తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదు: కేసీఆర్‌

By సుభాష్  Published on  14 Sep 2020 8:29 AM GMT
ఇలా అయితే తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదు: కేసీఆర్‌

ఇకపై తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎలాంటి అవినీతి ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి సభలో మాట్లాడారు. ఇకపై తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదని, ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్దకు అధికారం లేదని స్పష్టం చేశారు. సబ్‌ రిజిస్టార్లకు ఎలాంటి విచక్షణ అధికారం లేదని అన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చని, కానీ వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని అన్నారు.

బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫోటోతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడతామన్నారు. ఈ వివరాలు లేకుండా తహసీల్దార్లకు పోర్టల్‌ కూడా తెరుచుకోదని, పకడ్బందీ వ్యూహాంతోనే ఈ రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. పేద రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇక వీఆర్వో వ్యవస్థ ఉండబోదన్నారు. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాగానే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఆప్‌డేషన్‌ కాపీలు వస్తాయన్నారు. పేదలు, రైతుల హక్కులు కాపాడుతామని, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

సమగ్ర భూ సర్వే జిల్లాకొక ఏజన్సీకి ఇచ్చే అవకాశం ఉందని, సమగ్ర సర్వే చేసి కన్‌క్లూజివ్‌ టైటిల్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. కన్‌క్లూజివ్‌ టైటిల్‌ ఇస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని, అలాంటి సత్తా ప్రభుత్వానికి రావాలని కోరుకుంటున్నామని అన్నారు.

Next Story