మూగబోయిన తెలంగాణ ఎన్నికల ప్రచార మైకులు

By రాణి  Published on  20 Jan 2020 12:43 PM GMT
మూగబోయిన తెలంగాణ ఎన్నికల ప్రచార మైకులు

  • ముగిసిన తెలంగాణ పురపోరు ప్రచారం

తెలంగాణలో పురపోరుకు ప్రచారం నేటితో ముగిసింది. 120 మున్సిపాలిటీల్లో, 9 కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు, స్పీకర్లన్నీ మూగబోయాయి. ఈ నెల 22వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల ప్రక్రియ కోసం ఇప్పటికే 120 మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అలాగే 9 కార్పొరేషన్లలోని 1,586 పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

మొత్తం 53,36,505 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,71,694 మంది ఉండగా...26,64,557 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 69 వార్డుల్లో టీఆర్ఎస్, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా..మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ రాష్ర్టంలోని వైన్స్, బార్లు షాపులు మూతపడనున్నాయి. అలాగే ఎన్నికలకు సంబంధించిన బల్క్ మెసేజ్ లను నిషేధించారు. ఎవరైనా నిషేధాజ్ఞలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.

ఇకపోతే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు తమదంటే తమదేనని గొప్పలు చెప్పుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్ర నాయకులు కూడా పురపోరుకు సై అంటే సై అన్నారు. పురపోరులో కూడా టీఆర్ఎస్ దే ఏకగ్రీవ విజయమని కేటీఆర్ చెప్పగా..విజయం తమనే వరిస్తుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story