ముగిసిన తెలంగాణ మున్సి''పోల్''

By రాణి  Published on  22 Jan 2020 12:12 PM GMT
ముగిసిన తెలంగాణ మున్సిపోల్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ క్యూ లో ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు. రాష్ర్టంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకట్రెండు పోలింగ్ బూత్ లలో ప్రారంభ సమయంలో ఈవీఎంలు మొరాయించినా ఆ తర్వాత అధికారులు వాటిని సరిచేశారు. కానీ..ఈసారి మున్సిపల్ ఎన్నికలు తగాదాలు, ఘర్షణలతో ముగిశాయి. పోలింగ్ బూత్ ల వద్ద అధికార పార్టీకి చెందిన వారు డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను మభ్యపెడుతుండటం గమనించిన కొంతమంది వారిపై దాడి చేసినంత పని

చేశారు.

కరీంనగర్ మినహా రాష్ర్ట వ్యాప్తంగా 2,647 వార్డుల్లో, 382 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం ఈ నెల 24వ తేదీన పోలింగ్ జరగనుంది. 25వ తేదీన అన్ని వార్డులు, కార్పొరేషన్ల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 69 వార్డుల్లో టీఆర్ఎస్, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

  • పోలింగ్ కు అంతరాయం

వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేటలోని భవానీకుంట 4వ వార్డు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లోనే పోలింగ్ జరపాల్సి వచ్చింది.

జగిత్యాలలో....

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలింగ్ బూత్ కు 100 మీటర్ల నిబంధనను టీఆర్ఎస్ కార్యకర్తలు ఉల్లంఘించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

రంగారెడ్డిలో ఓటర్లను చితకబాదిన కాంగ్రెస్ నేతలు

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ 8వ వార్డులో నకిలీ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని కాంగ్రెస్ నేతలు చితకబాదారు. వారిద్దరూ 70 దొంగ ఓట్లు వేస్తే ఓటుకు మూడువేలు చొప్పున ఇస్తానని టీఆర్ఎస్ నాయకుడు నాగార్జున మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

వరంగల్ లో తోపులాట

వర్థన్నపేట డీసీ తండా 6వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ తోపులాటకు కారణమైన ఆరుగురిని అదపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో...

హైదరాబాద్ సమీపంలోని బోడుప్పల్ లో కాంగ్రెస్ - టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ స్టేషన్ వద్ద డబ్బులు పంచుతున్నాడంటూ...టీఆర్ఎస్ అభ్యర్థి జడిగే రమేష్ యాదవ్ ఆరోపించారు.

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కళనగర్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతుండగా..కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన కార్యకర్తలను వారిని అడ్డుకుని పట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.

సంగారెడ్డిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో...ఓటర్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో అరకొర వసతులతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. 11వ నెంబర్ బూత్ లో కుర్చీలు లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది నేలపై కూర్చుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. అక్కడే ఉన్న డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి రెండు వర్గాలను చెదరగొట్టి..అక్కడి నుంచి పంపేశారు.

Next Story