చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం దొరుకుతుందా.?

By Newsmeter.Network  Published on  16 Jan 2020 7:10 AM GMT
చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం దొరుకుతుందా.?

రైతు ఆత్మహత్యల గురించి అన్ని పార్టీలూ గగ్గోలు పెడతాయి. రైతుల శవాలు తీసుకుని ధర్నాలు చేస్తాయి. రైతుల పోరాటాల గురించి మహోగ్ర ప్రసంగాలు చేస్తాయి. చనిపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాయి. కానీ ఎంతమంది రైతులకు నిజంగా ఎంత మంది చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం లభించింది? చనిపోయిన రైతుల కుటుంబాలలో చాలా తక్కువ మందికి పరిహారం లభించదు.

అసలు చనిపోయిన రైతుల్లో చాలా మంది మరణాలను వ్యాధుల వల్లో లేక కుటుంబపరమైన కారణాల వల్లో చనిపోయినట్టు చూపించడం జరుగుతుంది. మరి కొంత మందిని గుండె పోటు వల్లో లేక ఇతర కారణాల వల్లో చనిపోయినట్ట నివేదికలు చెబుతాయి. నష్టపరిహారం విషయంలో అన్నిటికన్నా కీలకమైనది జిల్లా రైతు కమిటీ నివేదిక. ఈ నివేదిక రైతు పంట నష్టాల వల్లే చనిపోయాడని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ నివేదిక రావడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా నష్టపరిహారం అందడం లేదు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. వీరు రెండు మూడు నెలల్లో నివేదిక ఇవ్వవచ్చు. కానీ ఈ పనిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దీంతో పరిహారం అందని ద్రాక్ష అవుతోంది..

ఉదాహరణకు వరంగల్ జిల్లా ధర్మన్న సాగర్ మండలంలోని దేవెనూర్ గ్రామానికి చెందిన రైతు చంద్రరావు అక్టోబర్ 15, 2015 న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబానికి ఇప్పటి వరకూ నష్టపరిహారం లభించలేదు. హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సందరాజు సుధాకర్ 2015 లో చనిపోయాడు. వీరిద్దరి విషయంలోనూ త్రిసభ్య సంఘం ఇప్పటికీ నివేదికను ఇవ్వలేదు. నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో రికార్డుల ప్రకారం రైతులకు రూ. 35 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయమైపోయినా, ఇప్పటి వరకూ వారికి పరిహారం అందలేదు. తెలంగాణ లోని యాదాద్రి భువనగిరిజిల్లాలో 18 కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు నిధులు కేటాయించినా ఇప్పటి వరకూ వారికి పరిహారం అందలేదు.

మొత్తం మీద ప్రబుత్వాలు, పార్టీలు రైతు చావులపై రాజకీయాలైతే చేస్తున్నాయి కానీ బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే విషయంలో మాత్రం శుష్కవాదాలు చేస్తూ శూన్య హస్తాలు చూపిస్తున్నాయి. మాటలైతో కోటలు దాటుతున్నాయి కానీ చేతులు మాత్రం జేబుల్లోకి వెళ్లడం లేదు. నష్టపరిహారం ఇవ్వడం లేదు.

Next Story