ఇంటి నుంచే ఓటు.. ఆన్‌లైన్‌లో ఎన్నికల ప్రక్రియ..!

By సుభాష్  Published on  18 Sep 2020 5:59 AM GMT
ఇంటి నుంచే ఓటు.. ఆన్‌లైన్‌లో ఎన్నికల ప్రక్రియ..!

అభ్యర్థుల నామినేషన్ల మొదలు.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు ఈసారి ఓటింగ్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. దీని ద్వారా ఓటింగ్‌ శాతం పెరగడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించవచ్చని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అనేక సూచనలు చేసిందని, వాటితోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీలైనంత వరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుందామని అనుకున్నామని అన్నారు. అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయడం మొదలు ఓటింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అభ్యర్థుల నేర చరిత్ర, విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు.

అలాగే ఈసారి హెచ్‌ఎంసీ పరిధిలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈ-ఓటింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అయిన దీనిని అమలు చేయాలని భావిస్తున్నామని, హైదరాబాద్ పరిధిలో ఓటు వేసేందుకు బయటకు రావడానికి చాలా మంది ఇష్టపడటం లేదన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు. ఇటువంటి వారి కోసమే ఈ-ఓటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగానే సాధ్యసాధ్యాలపై 'సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌' అధ్యయనం చేస్తోందన్నారు. ఇది కనుక సక్సెస్‌ అయితే మిగతా ఎన్నికల్లోనూ అమలు చేయవచ్చు.. ఇందుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

2016 ఫిబ్రవరి 16న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2021 ఫిబ్రవరి 10 నాటికి కాలపరిమితి పూర్తవుతుంది. అలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ఓట్ల గల్లంతుపై ఎలాటి చర్యలు తీసుకుంటున్నారు..

ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తయారు చేయదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి తీసుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డుల వారీగా తయారు చేసి ప్రచురిస్తుంది. కొత్తగా ఓటర్లను నమోదు చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలన్నా మొదట అసెంబ్లీ పరిధిలోని ఓటరు జాబితాలోనే చేయాల్సి ఉంటుంది. అందుకే ఓటర్లు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక వేళ జాబితాలో లేకపోతే నమోదు చేసుకోవాలని అని అన్నారు.

Next Story