కరోనా మహమ్మారి: తెలంగాణలో 27కు చేరిన కరోనా కేసులు
By సుభాష్ Published on 23 March 2020 9:26 AM ISTకరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13వేలకు పైగా మృతి చెందగా, 3 లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్ విషయానికొస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 350 దాటిపోయింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. నిన్న ఒక్క రోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణను లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా ప్రజా రవాణా మొత్తం బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 31 వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని, ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని సూచిచారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడవద్దని, అది కూడా కొంత దూరంగా ఉండాలని కోరారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 75 జిల్లాలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఇప్పటికే గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లను మూసివేసిన విషయం తెలిసిందే.