ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండ్రు: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  9 Sep 2020 9:37 AM GMT
ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండ్రు: సీఎం కేసీఆర్‌

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో కేసీఆర్‌ మాట్లాడారు.. కరోనా విసయంలో యావత్‌ ప్రపంచం గందరగోళానికి గురవుతోందని, కరోనాపై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయని అన్నారు. కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామని, వైద్య రంగంలో నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.

కరోనా భయంతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని, తబ్లిగ్‌ గురించి ఢిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది మేమే అని అన్నారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో రెండు లక్షల వలస కార్మికులను వారి వారి సొంతూళ్లకు పంపించామని అన్నారు. మరణాల రేటు విషయంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలో తక్కువగా ఉందని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు మరో రూ.10వేల కోట్లయినా ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అలాగే ఫ్రంట్‌ వారియర్స్‌కు అదనపు జీతం ఇచ్చి ప్రోత్సహించింది తెలంగాణనే అని అన్నారు.

ఆందోళనతో ఎవరు ఆగమాగం కావద్దు

కరోనా నియంత్రణలో ఉంది.. ఆందోళనతో ఎవరు ఆగమాగం కావాల్సిన పనిలేదన్నారు. నేను ఉన్నంతకాలం ఎవరూ ఏమాత్రం ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట నేనే కోరాను.. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది అని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నాం.. రాష్ట్రంలో 20వేల బెడ్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని, ప్రభుత్వం తన పరిధిలో నూటికి నూరుశాతం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

అంగీకరించే నిజాయితీ మాకుంది

108 తీసుకొచ్చింది వైఎస్సేనని అంగీకరించే నిజాయితీ మాకుందని అన్నారు. మంచి స్కీం కాబట్టే మేం అధికారంలోకి వచ్చాక యథాతధంగా కొనసాగిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా ఆయుష్మాన్‌భవ పథకం లేదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి రూ.10వేల కోట్ల పంటను కొనుగోలు చేశామని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు.

Next Story