ఉత్తరాయణం రాగానే రామ మందిర నిర్మాణ ట్రస్టు ఏర్పాటు

By రాణి  Published on  6 Jan 2020 7:46 AM GMT
ఉత్తరాయణం రాగానే రామ మందిర నిర్మాణ ట్రస్టు ఏర్పాటు

మకర సంక్రాంతి పండుగ వెనువెంటనే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసే అవకాశాలున్నాయి. సంక్రాంతి తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ జారీ చేయడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నారు. ఈ ట్రస్టు మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు మూడు నెలల లోపు మందిర నిర్మాణ ట్రస్టును ఏర్పాటు చేయాలన ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుని, ఈ మూడో వారంలో ట్రస్టును ఏర్పాటు చేయబోతున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 9 లోపల ట్రస్టును ఏర్పాటు చేయాలి.

ఈ ట్రస్టు పూర్తి స్వాతంత్ర్యంతో వ్యవహరిస్తుంది. ఇందులో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరిలో ఒకరు కేంద్రం ప్రతినిథి కాగా మరొకరు రాష్ట్రం ప్రతినిధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ధర్మ గురువులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే బిజెపి నాయకులెవరూ ఇందులో సభ్యులుగా ఉండబోరు.

భవ్యమైన రామ జన్మభూమి మందిరం మొత్తం 67 ఎకరాలలో ఉండబోతోంది. సుప్రీం ఆదేశాల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాల భూమిని ఇవ్వవలసి ఉంది. ఇందుకు గాను ఇప్పటికే యూపీ ప్రభుత్వం నాలుగు చోట్ల స్థలాన్ని చూపించింది. వీటిలో ఏదో ఒక దానిని సున్నీ వక్ఫ్ బోర్డు ఎంచుకోవలసి ఉంది.

Next Story