అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫట్టా ?

By రాణి  Published on  19 Dec 2019 7:30 AM GMT
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫట్టా ?

ముఖ్యాంశాలు

  • అభిశంసన వీగిపోయే అవకాశాలెక్కువ ?
  • ఒకరోజు ముందే హౌస్ స్పీకర్ కు ట్రంప్ లేఖ
  • జనవరిలో సెనెట్ కు అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రతినిధుల సభ అభిశంసించింది. అమెరికా ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటింగ్ పడింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా..ఆ ఆరోపణలు అబద్ధమని 197 ఓట్లు పోల్ అయ్యాయి. అలాగే ఆయన కాంగ్రెస్ ను అడ్డుకున్నారన్న రెండో ఆరోపణకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. దీంతో ట్రంప్ పై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

ప్రతినిధుల సభలో ఆయన అపకీర్తి పాలైన మూడో అధ్యక్షుడిగా అమెరికా చరిత్రకెక్కారు. ట్రంప్ కన్నా ముందు ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ అభిశంసనకు గురయ్యారు. ప్రస్తుతం ట్రంప్ పై పెట్టిన అభిశంసన వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెనేట్ లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఎక్కువ ఉండటంతో ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోయే అవకాశాలు తక్కువే అంటున్నారు కొందరు. ఒకవేళ ట్రంప్ పదవి కోల్పోతే..అమెరికా అధ్యక్షుడి స్థానాన్ని ప్రస్తుత ఉపాధ్యక్షుడు భర్తీ చేస్తారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం...అధ్యక్షుడు పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా, మరణించినా ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు పదవీ కాలాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ పై అభిశంసన పై జనవరి రెండవ వారంలో సెనెట్ లో చర్చ మొదలయ్యే అవకాశాలున్నాయి.

ట్రంప్ పదవికి ఏం ముప్పు లేదు..

అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైనంత మాత్రాన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే సెనెట్ లో ట్రంప్ పై వచ్చిన ఆరోపణల గురించి జరగబోయే విచారణే అత్యంత కీలకమైనది. ప్రతినిధుల సభలో ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని వేసిన ఓట్లను పరిశీలిస్తే అవన్నీ రిపబ్లికన్లవే. సభలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు 233 మంది ఉండగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు 197 మంది, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. మిగతా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనిని పరిశీలిస్తే ట్రంప్ పై పెట్టి అభిశంసన తీర్మానానికి అనుకూలంగా డెమొక్రటిక్ 233 ఓట్లు పడలేదు. అయితే అక్కడ డెమొక్రటిక్ పార్టీకి 67 శాతం మెజార్టీ రావడం దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది. ఒక వేళ ఓటింగ్ లో తీర్మానం గెలిస్తే ట్రంప్ తన అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి ఉంటుంది.

ట్విట్టర్ లో ట్రోల్ అవుతోన్న తులసీ

సెనెట్ లో ట్రంప్ వచ్చిన ఆరోపణలపై ఓటింగ్ వరకూ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కాగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు జోయి మన్చిన్ ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయగా, భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ప్రెజెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకున్నారు. అంటే సభలో ఉండి తీర్మానంపై ఎలాంటి నిర్ణయాన్ని తెలియజేయకపోవడం అనమాట. ఇది ట్రంప్ కు అనుకూలం. దీంతో ప్రస్తుతం తులసీని ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే..అభిశంసన తీర్మానాన్ని ముందే పసిగట్టిన ట్రంప్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి 30 పాయింట్లతో కూడిన ఆరు పేజీల లేఖ పంపారు. సభ సభ్యులు తనపై అభిశంసన తీర్మానం పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ అభిశంసన తీర్మానాన్ని సాలెం మంత్రగత్తెల విచారణగా పోలుస్తూ..రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులను విచారణ కాలరాసిందని వాపోయారు. ఇది స్పీకర్ నాన్సీ చదివినంత వరకు ఉన్న విషయం. కానీ లేఖను పూర్తిగా చదవలేదని నాన్సీ వెల్లడించడం విశేషం. ఎందుకంటే ఆ లేఖ చాలా చిరాకుగా ఉన్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. హౌస్ ఆఫ్ రిప్రజెంటీవ్స్ లో ట్రంప్ అభిశంసన తీర్మానం విజయం సాధించగానే డెమొక్రటిక్ సభ్యులు సంబరాలు చేసుకోబోతుండగా నాన్సీ వారిని హెచ్చరించారు. అప్పుడే సంబరాలు చేసుకోవద్దని, దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని, అప్పుడే ట్రంప్ పదవిలో ఉంటారో, లేదో తేలుతుందన్నారు.

Next Story